మొరం, మట్టిపైనే తారు వేసిన రెండు రోజులకే పెచ్చులూడివస్తున్న రోడ్డు..

మొరం, మట్టిపైనే తారు వేసిన రెండు రోజులకే పెచ్చులూడివస్తున్న రోడ్డు..

బాలానగర్​, వెలుగు : బీటీ రోడ్డు నిర్మాణంలో కనీస క్వాలిటీ ప్రమాణాలు పాటించకపోవడంతో వేసిన రెండు రోజులుకే పెచ్చులుపెచ్చులుగా ఊడి వస్తోంది. మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా బాలానగర్‌‌ మండలం పెద్దరేవల్లి నుంచి దేవునిగుట్ట తండా వరకు 1.2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మట్టి రోడ్డు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో బీటీ వేసేందుకు 2023లో గిరిజన సంక్షేమ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. కానీ ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రావడంతో టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది.

 ఈ క్రమంలో ఇటీవల మరోసారి టెండర్లు పిలవడంతో బీటీ రోడ్డు పనులను రూ.1.20 కోట్లకు ఓ కాంట్రాక్టర్‌‌ దక్కించుకున్నాడు. ఐదు రోజుల కింద పనులు ప్రారంభించాడు. బీటీ రోడ్డు వేయడానికి ముందు ఫౌండేషన్, సబ్‌‌ బేస్‌‌ లేయర్స్‌‌ వేయాల్సి ఉంది.

 డస్ట్, చిప్స్ వేశాక రోలర్‌‌తో తొక్కించి.. ఆ తర్వాత కంకర, దాని మీద తారు వేయాలి. కానీ సదరు కాంట్రాక్ట్‌‌ ఇవేమీ పట్టించుకోకుండా కేవలం మొరం, మట్టి చల్లి దాని మీద తారు వేశాడు. దీంతో రోడ్డు వేసిన రెండు రోజులకే బీటీ మొత్తం పెచ్చులుపెచ్చులుగా ఊడిపోతోంది. విషయం తెలుసుకున్న దేవునిగుట్ట తండావాసులు వీడియో తీసి సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేయడంతో వైరల్‌‌గా మారింది.