
ముస్తాబాద్, వెలుగు: ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో నాణ్యత పాటించలేదని బీజేపీ నాయకులు విమర్శించారు. సోమవారం కొండాపూర్ లోని డబుల్ ఇండ్లని పరిశీలించారు. బీజేపీ నాయకుడు చిగురు వెంకన్న మాట్లాడుతూ.. నాణ్యతా ప్రమాణాలు లేకుండానే స్లాబులు పోశారన్నారు. స్లాబులపై వర్షానికి నీరు ఒక వైపు చేరుతోందన్నారు. దీంతో మడుగులు కడుగుతున్నాయని విమర్శించారు. చిన్నపాటి వానకు స్లాబు మొత్తం నానిపోయి పెచ్చులుగా ఊడి వస్తుందన్నారు. సంబంధిత ఏఈ పర్యవేక్షణ లేకపోవడంతోనే కాంట్రాక్టర్లు ఇష్టారీతిన పనులు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి స్వగ్రామంలోనే ఇలాంటి దుస్థితి ఉందని వాపోయారు. కార్యక్రమంలో గాగిల్లపురం అనిల్, కనమేని లింగారెడ్డి , బీజేవైఎం నాయకులి తాటిపల్లి ప్రణీత్ రెడ్డి, గంధం అజయ్, ఐనేని భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .