ధర్మసాగర్ పై ముప్పేట దాడి!.. క్వారీల బ్లాస్టింగ్స్ తో రిజర్వాయర్ కు పొంచి ఉన్న ముప్పు

ధర్మసాగర్ పై ముప్పేట దాడి!..  క్వారీల బ్లాస్టింగ్స్ తో రిజర్వాయర్ కు పొంచి ఉన్న ముప్పు
  • ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న గుట్టల్లో  మైనింగ్ కు గుడ్డిగా పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు
  • అవినీతికి పాల్పడి రూల్స్ కు విరుద్ధంగా ఓకే చెప్పినట్టు ఆరోపణలు  
  •  క్వారీల్లో బ్లాస్టింగ్స్ జరుగుతుండగా నో యాక్షన్

హనుమకొండ, వెలుగు : దేవాదుల ప్రాజెక్టులో కీలకమైన ధర్మసాగర్ రిజర్వాయర్ పై ముప్పేట దాడి జరుగుతోంది. ఆఫీసర్లంతా కలిసి గుడ్డిగా క్వారీలకు పర్మిషన్లు ఇచ్చి ప్రాజెక్ట్ ను ప్రమాదంలోకి  నెట్టేశారు. లక్షలాది ఎకరాలకు సాగు నీరు, వరంగల్ సిటీకి తాగునీరు అందిస్తుండగా.. రిజర్వాయర్ కు ఆనుకుని ఉండే గుట్టలను కంకర క్వారీలకు రూల్స్ కు విరుద్ధంగా కేటాయించారు.  క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే పర్మిషన్ల ఇచ్చేశారు. రిజర్వాయర్ కు ముప్పు ఉండదని నిర్ధారించాకే  ఎన్వోసీలు, పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 

కానీ ఆఫీసర్లు..అవినీతి, అక్రమాలకు పాల్పడి పర్మిషన్లకు ఓకే చెప్పినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  మూడు చోట్ల కంకర క్వారీల  నిర్వాహకులు గుట్టల్లో ఇష్టానుసారంగా బ్లాస్టింగ్ లకు పాల్పడుతున్నారు. దీంతో దేవాదుల ఎత్తిపోతల పథకానికి గుండెకాయ అయిన ధర్మసాగర్ ​రిజర్వాయర్ కు ముప్పు పొంచి ఉంది.  క్వారీల పర్మిషన్ క్యాన్సిల్ చేసే విషయమై ఆఫీసర్లు తీరొక్క సమాధానం చెబుతుండడం గమనార్హం.

ముప్పు ఉందని తెలిసినా ఎన్​వోసీ జారీ

ఎక్కడైనా గ్రానైట్, కంకర క్వారీలు లేదా ఇతర మైనింగ్ పనులు చేపట్టాలంటే తొలి దశలో స్థానిక తహసీల్దార్​ నుంచి ఎన్వోసీ(నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) తప్పనిసరిగా తీసుకోవాలి. అది ప్రభుత్వ స్థలమా, ప్రైవేటుదా, అక్కడ మైనింగ్ పనులకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా..! అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాకే ఎన్​వోసీ జారీ చేయాలి. ఇలాంటివేవీ  పట్టించుకోకుండానే 2018లో అప్పటి తహసీల్దార్ మైనింగ్ కు ఎన్వోసీ జారీ చేశారు.

 ఇందుకు భారీగానే ముడుపులు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు కూడా ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ ఇచ్చేశారు. వీటిని పొందిన నిర్వాహకులు.. అనంతరం డీజీఎంఎస్(డైరెక్టర్ జనరల్ ఆఫ్​మైన్స్ సేఫ్టీ) నుంచి బ్లాస్టింగ్ కు పర్మిషన్లు తెచ్చుకున్నారు.  

ఇష్టానుసారంగా బ్లాస్టింగ్స్

 రిజర్వాయర్లకు 200 మీటర్లలోపు ఎలాంటి బ్లాస్టింగులకు పర్మిషన్​ ఇవ్వకూడదనే రూల్ ఉంది. అయినా ఆఫీసర్లంతా మూకుమ్మడిగా అక్రమాలకు పాల్పడి ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా బ్లాస్టింగ్స్ జరిగిన క్వారీతో పాటు రెన్యూవల్ కోసం చూస్తున్న మరో క్వారీ, రిజర్వాయర్ కు 200 మీటర్లలోపే ఉన్నాయి.  వీటికి కొద్దిదూరంలోనే ఇంకో క్వారీ ఉంది. అక్కడా తరచూ బ్లాస్టింగ్స్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పెసో(పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్) లైసెన్స్ ఉంటేనే బ్లాస్టింగ్స్ చేపట్టాలి. అంతేకాకుండా  బ్లాస్టింగ్స్ చేసేందుకు లీజు పర్మిషన్ కాపీలతో పాటు తేదీ, సమయం తదితర వివరాలను కూడా పోలీసులకు అందించాలి. 

ఇలాంటి పర్మిషన్లు ముందుగా తీసుకున్నాకే  బ్లాస్టింగ్స్ ప్రారంభించాలి.  అయితే... ఇక్కడి క్వారీల నిర్వాహకులు స్థానిక పోలీసులను మేనేజ్ చేసుకుని, జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్స్ చేస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఇదివరకే పేలుళ్లు జరపడంతో బోరు బావులు కూలిపోయాయని పేర్కొంటున్నారు. ఇప్పుడు క్వారీ నిర్వహణకు తాటి చెట్లను కూడా నాశనం చేశారని చెబుతున్నారు. కాగా పేలుళ్లపై ధర్మసాగర్ సీఐ ప్రవీణ్​ను వివరణ కోరగా.. క్వారీల్లో బ్లాస్టింగ్స్ కోసం నిర్వాహకులు గతంలోనే పర్మిషన్ తీసుకున్నారని తెలిపారు. తాజాగా జరిగిన బ్లాస్టింగ్ పై తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. 

రోజులు గడుస్తున్నా నో యాక్షన్

జే.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలో ధర్మసాగర్ రిజర్వాయరే అత్యంత కీలకమైనది. దాదాపు1.5 టీఎంసీల సామర్థ్యంతో 1.76 లక్షల ఆయకట్టును కలిగి ఉంది. ఇక్కడి నుంచి పంపింగ్ చేసే నీటితో గండి రామారం, బొమ్మకూరు, తపాస్ పల్లి, ఐనాపూర్ తదితర రిజర్వాయర్ల పరిధిలోని మరో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇంతటి ముఖ్యమైన రిజర్వాయర్ కు ఒకవైపు గుట్టలే కట్టడంగా ఉన్నాయి. ఇప్పుడు వాటిపైనే తరచూ బ్లాస్టింగ్స్ చేస్తున్నారు. ఈనెల 4న కూడా బ్లాస్టింగ్ జరగగా.. ప్రాజెక్టుకు పగుళ్లు వచ్చి లీకేజీలు ఏర్పడ్డాయి. 

దీనిపై ఈ నెల6న‘ వెలుగు’ లో‘ ధర్మసాగర్ రిజర్వాయర్ కు బ్లాస్టింగ్ ముప్పు’ స్టోరీ పబ్లిష్ అయింది. దీంతో మైనింగ్, ఇరిగేషన్​ఆఫీసర్లు జాయింట్​ఇన్​స్పెక్షన్ చేశారు. క్వారీ నిర్వహణతో తలెత్తిన ఇబ్బందులు మెన్షన్ చేస్తూ పర్మిషన్ రద్దు కోరుతూ లెటర్ పెట్టాల్సిందిగా ఇరిగేషన్​ఆఫీసర్లకు సూచించారు.  15 రోజులు దాటినా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. ఇకనైనా తగిన చర్యలు చేపట్టి ధర్మసాగర్ రిజర్వాయర్ కు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

క్వారీ పర్మిషన్ల రద్దుకు లేఖ రాశాం

ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద బ్లాస్టింగ్ చేస్తుండడంతో గతంలోనే క్వారీ పర్మిషన్లు రద్దు చేయాలని మైనింగ్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కు లేఖ రాశాం. తాజాగా కూడా బ్లాస్టింగ్స్ జరగడంతో జాయింట్ గా ఇన్ స్పెక్షన్ చేశాం. అక్కడి పరిస్థితులను వివరిస్తూ రెండు క్వారీల పర్మిషన్లు​రద్దు చేయాలని ఈనెల16న మైనింగ్ అధికారుల లెటర్ అందజేశాం. సీతారాం నాయక్, ఇరిగేషన్​ ఈఈ

 మాకు ఎలాంటి లెటర్ అందలేదు

ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద క్వారీకి గతంలోనే పర్మిషన్ ఇచ్చారు.  బ్లాస్టింగ్ జరగడంతో జాయింట్ ఇన్ స్పెక్షన్ చేసి జిల్లా కలెక్టర్​తో పాటు మైనింగ్ డైరెక్టర్​కు రిపోర్ట్ ఇచ్చాం. క్వారీ పర్మిషన్ రద్దు చేయాలంటే రిజర్వాయర్ కు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో వివరిస్తూ లెటర్ పెట్టాల్సిందిగా ఇరిగేషన్ ఆఫీసర్లకు సూచించాం. కానీ మాకు ఎలాంటి లెటర్ ​అందలేదు.    - ఎ.రవిశంకర్, ఇన్​చార్జ్ ఏడీ, మైన్స్ అండ్ జియాలజీ, హనుమకొండ,  - ఆర్.సాయినాథ్, ఇన్ చార్జ్ డీడీ, మైన్స్ అండ్ జియాలజీ, వరంగల్