
పిల్లలు తాము చూసిన ప్రతి అంశం గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు, ఉపాధ్యాయులను ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ అంటూ ప్రశ్నల వర్షంలో ముంచేస్తారు. ఆకులు పచ్చగానే ఎందుకు ఉన్నాయి ? వంటింటిలోని ప్రెషర్ కుక్కర్ విజిల్ మోత ఎందుకు చేస్తోంది? పసుపును, సున్నాన్ని కలిపితే ఎర్రని ద్రవం ఎందుకు వచ్చింది? సోడా సీసా మూత తీయగానే బుస్సుమని నురగలతో కూడిన ద్రవం ఎందుకు వస్తుంది? దెబ్బ తగిలి రక్తం కారినపుడు అమ్మ పసుపు పూసి గుడ్డతో ఎందుకు కడుతుంది? ఇలాంటి నిత్య సత్యాలను చూస్తూ, చూసిన ప్రతి విషయం గూర్చి తెలుసుకోవాలనే తపనతో పిల్లలు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.
పిల్లలు మాత్రమే ఏమిటి, పెద్దలకు కూడా ఇలాంటి ప్రశ్నలు రావడం వల్లనే అద్భుత ఆవిష్కరణలు ఆవిష్కరితమయ్యాయి. నిజానికి ప్రకృతిని నిరంతరం ప్రశ్నించడమే నిన్నటి వైజ్ఞానిక శాస్త్రానికి, నేటి ఏఐ విప్లవానికి పునాదిగా నిలుస్తున్నది, రేపటికి శాస్త్ర సాంకేతికశాస్త్ర విస్తృతికి ఏకైక ఆధారంగా ప్రశ్నించడమనే కళ నిలుస్తుంది కూడా. ఆపిల్ చెట్టుపై నుంచి కిందికే ఎందుకు పడింది అనే న్యూటన్ వేసిన ప్రశ్న, అలాగే నీటికి రంగు లేనప్పటికీ సముద్రజలం నీలి రంగులో, ఆకాశం కూడా నీలి రంగులో ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్న సర్. సి. వి. రామన్‌కు రావడం వల్లనే కదా గొప్ప వైజ్ఞానికశాస్త్ర ఆవిష్కరణకు దారి తీశాయని మనకు తెలుసు. నిజానికి ప్రశ్నించే తత్వమే సృజనకు, ఆవిష్కరణలకు, వైజ్ఞానిక, టెక్నాలజీ విషయ పరిజ్ఞాన విస్తృతికి పునాది అని తెలుసుకోవాలి.
ప్రశ్నించే తత్వంతో ప్రయోజనాలు
ప్రశ్నించడమే తెలుసుకోవాలనే తపనను సూచిస్తుంది. ప్రశ్నించడం అనే పునాది మీదనే శాస్త్రసాంకేతిక అభివృద్ధికి మూలం. పిల్లలు ప్రశ్నలు అడిగితే విసుక్కోవడం, సమాధానం చెప్పకపోవడంతో వారిలో తెలుసుకోవాలనే జిజ్ఞాసను ఆదిలోనే తుంచేస్తున్నామని, అదే పిల్లలు ప్రశ్నించడం మానేసి అజ్ఞానాన్ని మోస్తూ కాలం గడుపుతారు. నిజానికి నేటి సమాజం.. ప్రశ్నించేవారిని అవిధేయులని, విప్లవకారులని, విసిగించేవారని ముద్ర వేస్తున్నది. పిల్లలు అడిగే ప్రతి అర్థవంతమైన ప్రశ్నకు నిదానంగా, ఓపికగా సమాధానాలు చెప్పడం ఇంట్లో తల్లిదండ్రుల నుంచే మొదలుకావాలి.
అమ్మ నాన్నలు తమ పనుల్లో పడి పిల్లలు ప్రశ్నలు అడిగితే వెంటనే విసుక్కోవడం తరచుగా జరుగుతున్నది. సమాధానం తెలిస్తే వెంటనే చెప్పండి. తెలియకపోతే తెలుసుకొని సరైన సమాధానం చెప్పండి. అడిగిన ప్రతి అర్థవంతమైన ప్రశ్నకు బహుమతి ఇవ్వండి. ప్రశ్నలు అడిగేలా సిద్ధం చేయడం. తెలియని విషయాన్ని ఇతరుల నుంచి సమాధానాలు పొందడంతో విజ్ఞానం పెరుగుతుంది. ప్రశ్నించే నైపుణ్యం పిల్లల్లో ఉన్నట్లయితే అది చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెరగడం, లోతైన విషయ అవగాహన కలగడం, సమస్యలకు సమాధానాలను వెదికే గుణం పెరగడంలాంటి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.
తరగతి గది ప్రశ్నల నిధి
కంటెంట్‌ను ఆలకింపు చేసుకోవడం, దానిపట్ల లోతైన అవగాహనను కలిగించడం ప్రశ్నించే నైపుణ్యాన్ని పెంచే తరగతి గదులను కార్యశాలలు లేదా ప్రయోగశాలలుగా తయారు చేద్దాం. నిన్నటి సుద్ద ముక్క, బ్లాక్ బోర్డు విధానం నెమ్మదిగా కనుమరుగవుతున్నది. అభ్యాసకులు ప్రశ్నించే పద్ధతితో జ్ఞాన ఆధారిత సమాధానాలు, సానుకూల అభ్యాసం పెరుగుతుంది. మన నేటి పిల్లలు, యువతను జీవితకాలంపాటు ప్రశించే గొంతులుగా, విజ్ఞాన సమాధానాలు పొందేవిధంగా తీర్చిదిద్దాలి.
21వ శతాబ్దపు తరగతి గది ఇలా ఉండాలి !
ప్రశ్నించే నైపుణ్యం అంటే తరగతి గదిలో సరైన సమయంలో సరైన ప్రశ్నలు అడిగే సామర్థ్యం అని తెలుసుకోవాలి. పిల్లలు ప్రశ్నించేవిధంగా బోధనలు కొనసాగించడమే ఉత్తమ ఉపాధ్యాయుడి అసలైన సమర్థత. బలమైన విద్యా పునాదిని నిర్మించడానికి ప్రశ్నించే నైపుణ్యం చాలా ప్రధానం. ప్రశ్నిస్తున్నారంటే తెలుసుకోవాలని అనుకుంటున్నారని అర్థం. ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడమే విజ్ఞానం. 21వ శతాబ్దపు తరగతి గదులు వాస్తవ ప్రపంచంలో జరిగే ప్రశ్నలతో నిండిపోవాలి.
రేపటి తరగతి గది సృజనాత్మకంగా, సహకారాత్మకంగా నేర్చుకునే విధానంపై దృష్టి సారించాలి. 21వ శతాబ్దపు తరగతి గది సహకార సమస్యలకు పరిష్కారాలు, ప్రతిభావంతమైన రాత, మౌఖిక సంభాషణలు, నైతిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాల కూర్పు, విమర్శనాత్మక ఆలోచనలు, వ్యక్తిగత చొరవకు చిరునామాలుగా మారాలి.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి-