- పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు
- లైన్లో గులాబీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా..
- నేతలను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం
హైదరాబాద్, వెలుగు: కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అధికార పార్టీలో చేరితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. కారు దిగి కాంగ్రెస్‌లో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు రేవంత్ తో భేటీ అయ్యారు. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు, ఇతర కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. ఆయా నేతలతో సమావేశాల్లో తాము కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంకేతాలు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్నది. అయితే అభివృద్ధి పనుల కోసమే సీఎం, మంత్రులను కలిసినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మరోవైపు కొంతమంది బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు రానున్న రెండు మూడ్రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరినట్టుగా తెలిసింది. త్వరలోనే సీఎం రేవంత్‌ను కలుస్తానని మాజీ మంత్రి మల్లారెడ్డి ఇటీవల మీడియాతో చిట్‌చాట్‌లో చెప్పడం గమనార్హం.
గతంలో కాంగ్రెస్, టీడీపీలో ఉన్నోళ్లే..
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎంతో భేటీ అయ్యారు. రాజేంద్రనగర్ఎమ్మెల్యే సైతం ముఖ్యమంత్రిని కలిశారు. గ్రేటర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు నగర శివార్లలోని ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించి, మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు కూడా కాంగ్రెస్‌లో చేరడానికి తమ సన్నిహితుల ద్వారా లాబీయింగ్చేస్తున్నట్టు తెలిసింది. గతంలో కాంగ్రెస్, టీడీపీల్లో ప్రజా ప్రతినిధులుగా ఉండి తర్వాత బీఆర్ఎస్లో చేరినవాళ్లలో ఎక్కువ మంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తున్నది. వాళ్లు రేవంత్ టీమ్‌లో క్రియాశీలంగా ఉన్న నేతలతో టచ్‌లోకి వెళ్లి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నట్టు సమాచారం. తమ వ్యాపారాలు, ఆస్తులను కాపాడుకునేందుకు కొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతున్నది.
అధిష్టానం తీరును తప్పుపడుతున్న ఎమ్మెల్యేలు..
కొత్త ప్రభుత్వంపై బీఆర్ఎస్అధిష్టానంవ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు తప్పుపడుతున్నారు. కొత్త ప్రభుత్వానికి టైమ్ ఇవ్వాలని, సీఎం రేవంత్‌ను ఎప్పుడైనా కలిసి ప్రజాసమస్యలపై చర్చించే అవకాశముందని, హామీల అమలుపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే వరకు వేచి చూడాలని సూచిస్తున్నారు. సీఎం రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ఇటీవల చేసిన ‘కనకపు సింహాసనమున’ ట్వీట్‌ను మెజార్టీ బీఆర్ఎస్ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఆఫ్‌ది రికార్డుగా తప్పుబడుతున్నారు. రేవంత్వ్యాఖ్యలపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే వరకు ఆగే ఓపిక లేకపోతే ఎలా? అని సీనియర్ఎమ్మెల్యే ఒకరు కామెంట్చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులనే ఓడిపోయిన తర్వాత కూడా రిపీట్చేస్తున్నారని, అందుకే పొలిటికల్‌గా సేఫ్జోన్చూసుకునే పనిలో ఎక్కువ మంది నాయకులు ఉన్నారని బీఆర్ఎస్ సీనియర్ నేతలు అంటున్నారు.
బీఆర్ఎస్ అలర్ట్..
కొందరు తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అలర్ట్ అయింది. వాళ్లను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. కాంగ్రెస్‌లో చేరేందుకు ఎమ్మెల్యేలు ఇస్తున్న సంకేతాలపై గులాబీ బాస్ కేసీఆర్‌కు సమాచారముందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం ఎమ్మెల్యేలతో నిర్వ హించిన సమావేశంలో కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దని కేసీఆర్ హెచ్చరించారు. ఒకవేళ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రిని కలవాల్సి వస్తే పార్టీకి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రజా సమస్యలపై ప్రజల సమక్షంలోనే మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. తద్వారా ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.