మార్కెట్ వాల్యూ పెంపు ప్రతిపాదనలతో రిజిస్ట్రేషన్లకు క్యూలు

మార్కెట్ వాల్యూ పెంపు ప్రతిపాదనలతో రిజిస్ట్రేషన్లకు క్యూలు
  • అగ్రిమెంట్ డేట్​కు ముందే చేయించుకుంటున్న కొనుగోలుదారులు
  • రోజూ రూ.65 కోట్ల ఆమ్దానీ

హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూములు, ఆస్తుల మార్కెట్ వాల్యూను మరోసారి పెంచేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అవుతుండడంతో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. రెండు రోజులుగా సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ ఆఫీసులు అమ్మకందారులు, కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. మార్కెట్ వాల్యూ పెంపు ఉత్తర్వులు అమల్లోకి రాకముందే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. భూములు, ప్లాట్లు, ఇండ్లు, ఫ్లాట్ల కొనుగోలుకు అడ్వాన్స్ చెల్లించి.. ఒకటి, రెండు నెలల వాయిదాతో అగ్రిమెంట్ రాసుకున్నోళ్లు కూడా ముందే డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. అలాగే జనవరి 31లోగా రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా స్టాంప్ డ్యూటీ చెల్లించి ఇ‌‌‌‌–చలనాలు కట్టేస్తున్నారు. ప్లాటు సైజు, లోకల్ మార్కెట్ వాల్యూను బట్టి కనీసం రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు భారం తగ్గుతుందనే ఆశతో ముందస్తు రిజిస్ట్రేషన్లకు సిద్ధమవుతున్నారు.
ఒక్కరోజే రూ.72 కోట్లు..  
రెగ్యులర్​గా రోజుకు రూ.40 కోట్ల మేర ఆదాయం వస్తుండగా రెండు రోజులుగా మాత్రం రిజిస్ట్రేషన్ల శాఖ రోజువారీ ఆదాయం రూ.60 కోట్లు దాటుతోంది. మంగళవారం 4,661 రిజిస్ట్రేషన్లు కాగా, రిజిస్ట్రేషన్ల కోసం ఆఫ్ లైన్, ఆన్ లైన్ పద్ధతిలో చెల్లించిన ఇ‌‌–స్టాంప్స్ ద్వారా రూ.72 కోట్ల ఆదాయం సమకూరింది. అంతకు ముందు సోమవారం ఆదాయం రూ.65 కోట్లు దాటింది. మొత్తంగా ఈ నెలలో 25వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ శాఖకు రిజిస్ట్రేషన్లు, ఇ–స్టాంప్స్, ఈసీల జారీ, ఫ్రాంకింగ్ మిషన్, సర్టిఫైడ్ కాపీల జారీ ద్వారా 18 రోజుల్లో రూ.748 కోట్ల ఆదాయం వచ్చింది. నెలాఖరు వరకు ఈ ఆదాయం రూ.1,000 కోట్లు దాటే అవకాశముందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.

పెంపుతో నెలకు రూ.1500 కోట్ల దాకా..
అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇతర ఆస్తుల మార్కెట్ వాల్యూస్ తోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలను ఏరియాను బట్టి 30 శాతం నుంచి 50 శాతం వరకు ఈ ఏడాది జులైలో పెంచిన సంగతి తెలిసిందే. భూముల విలువ పెంచకముందు రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రతి నెలా సగటున రూ.500 కోట్లకు మించి ఆదాయం వచ్చేది కాదు. మార్కెట్ వాల్యూ, చార్జీలను పెంచిన తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గతంతో పోలిస్తే రెట్టింపైంది. ఇప్పుడు ప్రతి నెలా రూ.900 కోట్ల నుంచి వెయ్యి కోట్ల ఆదాయం వస్తోంది. మరోసారి మార్కెట్ వాల్యూ పెంచితే రూ.1,300 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల ఆదాయం సమకూరవచ్చని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన పది నెలల్లో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.7,578 కోట్ల ఇన్ కం వచ్చింది.