
జీడిమెట్ల, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. పేరుకు అన్ని వర్గాల కోసమని చెప్పి పథకాలు ప్రవేశపెట్టారని, కానీ ఏ ఒక్కరికి న్యాయం చేయలేదన్నారు. సెగ్మెంట్లోని సంక్షేమ సంఘాలతో మంగళవారం శ్రీశైలం గౌడ్ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం కొంపల్లిలోని ఎన్సీఎల్ కాలనీ, నొబెల్ ఎన్క్లేవ్, అశోక విల్లాస్, శ్రీనివాస నగర్లో ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్ సర్కారు 9 ఏండ్లలో చేయలేని అభివృద్ధిని తనను గెలిపిస్తే చేసి చూపిస్తానని ఆయన తెలిపారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వడ్డెరలకు 15 ఎకరాల స్థలం, ఇండ్ల పట్టాలు ఇప్పించానని గుర్తు చేశారు. ఎంతో మంది పేదలకు రేషన్‌కార్డులు సైతం అందజేశానని పేర్కొన్నారు. పేదల కోసం కష్టపడే తనను గెలిపించి ఆశీర్వదించాలని శ్రీశైలం గౌడ్ కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మోసపూరిత వాగ్ధానాలు నమ్మి మోసపోవద్దన్నారు.