
- నిందితుడి వద్ద అల్ట్రా సౌండ్ స్కానింగ్ మెషీన్, సెల్ ఫోన్ సీజ్
సూర్యాపేట, వెలుగు : లింగ నిర్ధారణ టెస్ట్ చేసి, ఆస్పత్రిలో అబార్షన్ చేయించగా గర్భిణి మృతి చెందిన కేసులో ఆర్‌ఎంపీని సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద అల్ట్రా సౌండ్ స్కానింగ్ మెషీన్ , సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం డీఎస్పీ ప్రసన్న కుమార్ కేసు వివరాలు తెలిపారు.
గత మే నెలలో మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన గర్భిణి బయ్య అనూష తనకు పుట్టబోయే బిడ్డ ఎవరనేది తెలుసుకునేందుకు నకిరేకల్‌కు చెందిన ఆర్‌ఎంపీ బాత్క యాదగిరిని సంప్రదించింది. అతడు తన వద్ద ఉన్న అల్ట్రా సౌండ్ స్కానింగ్ మెషీన్ ద్వారా గర్భిణిని టెస్ట్ చేసి పుట్టబోయేది ఆడపిల్ల అని చెప్పాడు. దీంతో ఆమె భర్త నగేశ్, మరో ఆర్‌ఎంపీ జానయ్య, బంధువు సందీప్ కలిసి సూర్యాపేటలోని ఒమేగా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ గర్భిణికి అబార్షన్ చేయించగా, తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా అనూష మృతి చెందింది. డీఎంహెచ్‌వో ఫిర్యాదుతో సూర్యాపేట టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్‌ఎంపీ యాదగిరిని అరెస్టు చేసి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. గతంలో యాదగిరిపై చిట్యాలలో కేసు ఉంది. తాజాగా10 మందిపై కేసు చేయగా.. కొందరు పరారీలో ఉన్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ వెంకటయ్య ఉన్నారు.