జనాభా లెక్కన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి: ఆర్ కృష్ణయ్య

జనాభా లెక్కన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి: ఆర్ కృష్ణయ్య
  • జనాభా లెక్కన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
  • బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు: జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీం కోర్టు అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 15 శాతం ఉన్న అగ్రవర్ణాలలో ఐదు నుంచి 6 శాతం మాత్రమే పేదలు ఉన్నారని, అలాంటపుడు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చట్టసభల్లో 50 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కుల సంఘాలు, వివిధ పార్టీలలోని బీసీ నాయకులు రాజకీయాలకు అతీతంగా బీసీల ఐక్యత కోసం మిలిటెంట్​తరహా ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తే 10 లక్షల వరకు బీసీలకు, 5 లక్షల వరకు ఎస్సీ, ఎస్టీ,  మైనార్టీలకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. త్వరలో చేపట్టనున్న జనాభా గణనలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.  బీసీలది ఆత్మగౌరవ పోరాటమని, ఆకలి పోరాటం కాదని అన్నారు. కుల సంఘాలు చేసే పోరాటాలు, త్యాగాలు రాజ్యాధికారం వైపు  మళ్లించేలా ఉండాలని సూచించారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు పట్నం మాణిక్యం, బీరయ్య యాదవ్ తదితరులుపాల్గొన్నారు.