పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలె: ఆర్ కృష్ణయ్య

పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలె: ఆర్ కృష్ణయ్య

ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, పలువురు బీసీ నేతలు ఆందోళన నిర్వహించారు. బీసీల జనగణన వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలంటూ నిరసన తెలిపారు. కేంద్రం బీసీలను ప్రోత్సహించాలని.. మొక్కుబడి రిజర్వేషన్లు వద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో అమలవుతున్న పథకాలను.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందించకపోతే రాష్ట్రాల పర్యటనకు వచ్చినప్పుడు కేంద్రమంత్రులను తిరగనివ్వమని హెచ్చరించారు. 

అప్పుల్లో బీసీలకు వాటా పంచుతున్నారని.. కానీ నిధులు మాత్రం ఇవ్వడం లేదని కృష్ణయ్య ఆరోపించారు. తమ వాటా తమకు ఇవ్వకపోతే.. తిరుగుబాటు తప్పదని కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కేంద్రం జనాభా లెక్కలను తేల్చలేకపోతోందని మండిపడ్డారు. బీసీ అని మోడీని గెలిపిస్తే.. రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చెయ్యలేదని ఆర్ కృష్ణయ్య విమర్శించారు.