
బషీర్‌బాగ్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం, హైకోర్టుల్లో కేవియట్ పిటిషన్ దాఖలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఇలా చేస్తే రిజర్వేషన్లపై ఎవరైనా న్యాయస్థానంలో పిటిషన్ వేసినా చెల్లదన్నారు. కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన హైకోర్టు బీసీ న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో రిజర్వేషన్లను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనకు పూనుకోవడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. సమావేశంలో హైకోర్టు న్యాయవాదులు విశ్వనాతుల రమేశ్‌బాబు, నాగుల శ్రీనివాస్ యాదవ్, అశోక్ కుమార్ యాదవ్, దేవేందర్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.