
ముషీరాబాద్, వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని కోరారు. బీసీల డిమాండ్ల సాధనకు ఈనెల 29న చలో కడప చేపట్టినట్లు తెలిపారు. సోమవారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన బీసీ ఉద్యోగుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడానికి చట్టపరమైన, రాజ్యాంగపరమైన, న్యాయపరమైన అవరోధాలు, అడ్డంకులు ఏమీ లేవని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫారసు చేసినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని మండిపడ్డారు. అన్నిపార్టీలతో చర్చిస్తున్నామని త్వరలోనే బీసీల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామన్నారు. కడప సభకు బీసీ ఉద్యోగులు బీసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ నేతలు వీరభద్రయ్య, రామకృష్ణ,, శ్రీహరి, నీల వెంకటేష్, రాజకుమార్, ఉదయ్ నేత, నాగుల శ్రీనివాస్, జయంతి, వాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.