పుష్ప సినిమా మాదిరి గంజాయి సప్లయ్..

పుష్ప సినిమా మాదిరి గంజాయి సప్లయ్..
  • ఆయిల్ ట్యాంకర్​, ట్రాలీ ఆటోలో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి తరలింపు
  • పోలీసులకు దొరకకుండా తరలిస్తే  డ్రైవర్, హెల్పర్​కు ట్రిప్పుకు రూ.లక్ష కమీషన్ 
  • రెండు గ్యాంగ్​లకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
  • రూ. కోటి 71 లక్షల విలువైన 630 కిలోల గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌‌, వెలుగు : పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న రెండు వేర్వేరు గ్యాంగ్​లకు చెందిన ఐదుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయిల్ ట్యాంకర్, ట్రాలీ ఆటోలో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి గంజాయి ప్యాకెట్లు పెట్టి ఏపీ, ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, ఢిల్లీకి తరలిస్తున్నట్లు గుర్తించారు. వీరి నుంచి రూ.కోటి 71 లక్షల విలువైన 630 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. 

రంపచోడవరం టు ఢిల్లీ

ఏపీలోని నర్సీపట్నానికి చెందిన నూకరాజు మహారాష్ట్రలోని పుణెకు గంజాయి ట్రాన్స్ పోర్టు చేస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ఏరియా నుంచి హైదరాబాద్ సిటీ మీదుగా మహారాష్ట్ర, ఢిల్లీకి గంజాయిని సప్లయ్ చేసేవాడు. ఏడాది కాలంగా నూకరాజు ఈ దందా చేస్తున్నాడు. పోలీసుల నిఘా పెరగడంతో పుష్ప సినిమా తరహాలో ఆయిల్ ట్యాంకర్​లో ప్రత్యేక అర ఏర్పాటు చేసి అందులో గంజాయి ప్యాకెట్లను ఉంచి తరలించడం మొదలుపెట్టాడు. ఇందుకోసం ఈస్ట్ గోదావరి జిల్లా తాడిపుడికి చెందిన అక్కబత్తుల లక్ష్మణ్ కుమార్(32), పోలవరంలోని దేవిపేటకు చెందిన గంట శ్రీనుబాబు(26)ను తన గ్యాంగ్​లో చేర్చుకున్నాడు.

పోలీసులకు దొరకకుండా ఆయిల్ ట్యాంకర్​లో గంజాయిని తీసుకొస్తే ఒక్క ట్రిప్పుకు రూ.లక్ష ఇచ్చేలా నూకరాజు వారితో ఒప్పందం చేసుకున్నాడు. నూకరాజు గ్యాంగ్ రంపచోడవరం నుంచి ఢిల్లీకి ఇప్పటికే మూడు సార్లు గంజాయిని తరలించారు. లక్ష్మణ్, శ్రీనుబాబు  బుధవారం మధ్యాహ్నం ఆయిల్ ట్యాంకర్​లో గంజాయిని పెట్టి రంపచోడవరం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. సిటీకి చేరుకుని ఓఆర్ఆర్ మీదుగా వెళ్తున్నారు.

సమాచారం అందుకున్న హయత్ నగర్ పోలీసులు పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ వద్ద నిఘా పెట్టారు. గంజాయి లోడ్​తో వస్తున్న ట్యాంకర్​ను గుర్తించారు. లక్ష్మణ్, శ్రీను బాబును అరెస్ట్ చేశారు. రూ.60 లక్షల విలువైన 200 కిలోల గంజాయితో పాటు ట్యాంకర్​ను స్వాధీనం చేసుకున్నారు. నూకరాజు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ఎస్కార్ట్​ వెహికల్​తో మహారాష్ట్రకు..

కర్నాటకలోని బీదర్​కు చెందిన మోహన్ రాథోడ్(25), బహుల్య లీలావతి అలియాస్ గంగరాజు(28) ఏపీ, ఓడిశా ఏజెన్సీల నుంచి గంజాయిని తీసుకుని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు సప్లయ్ చేస్తున్నారు. స్థానికంగా ఉండే గంజాయి సప్లయర్లు గోపాల్, సంతోష్​తో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశారు. గంజాయిని తరలించేందుకు మేడ్చల్ జిల్లా మల్లాపూర్​లోని ట్రాలీ ఆటో డ్రైవర్ పెద్దబాబు రావు(30), సికింద్రాబాద్​లోని లాలాపేటకు చెందిన ర్యాపిడో బైక్ డ్రైవర్ మద్దెల రమేశ్​తో ఒప్పందం చేసుకుని వారికి కమీషన్ ఇస్తానని చెప్పారు. ఒడిశా నుంచి గంజాయిని మహారాష్ట్రకు సప్లయ్ చేయాలన్నారు. మోహన్ రాథోడ్, బహుల్యలీలావతి, గోపాల్, సంతోశ్,పెద్దబాబు రావు, రమేశ్​ 8 ఐరన్ పిల్లర్ బాక్సులను తయారు చేయించారు.

వాటిని తీసుకుని ఒడిశా ఏజెన్సీ ఏరియాకు వెళ్లారు. అక్కడ 430 కిలోల గంజాయిని కొన్నారు. 2 కిలోల చొప్పున 215 ప్యాకెట్లుగా చేసి ఐరన్ పిల్లర్ బాక్సుల్లో పెట్టారు. లీలావతి, గోపాల్, సంతోష్ ఓ వెహికల్​లో ఎస్కార్ట్​గా ముందు వెళ్లగా.. వారి వెనకాలే ట్రాలీ ఆటోలో మోహన్ రాథోడ్, పెద్దబాబురావు, రమేశ్ గంజాయి లోడ్​తో సిటీకి బయలుదేరారు. ఈ గ్యాంగ్ గురించి సమాచారం అందుకున్న మల్కాజిగిరి పోలీసులు కీసర సమీపంలో నిఘా పెట్టారు.

మోహన్ రాథోడ్ గ్యాంగ్ సిటీకి చేరుకోగానే కీసర సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. మోహన్ రాథోడ్, పెద్దబాబు రావు, మద్దెల రమేశ్​ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.కోటి 11 లక్షల విలువైన 430 కిలోల గంజాయి, ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఎస్కార్ట్​​లో ఉన్న గోపాల్, లీలావతి, సంతోష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.