
ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ నుంచి సినిమా వస్తోందంటే కచ్చితంగా భారీ యాక్షన్ సీన్స్, మాస్ ఎలివేషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. కానీ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ వింటేజ్ పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’తో వస్తున్నాడు ప్రభాస్. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘సంచారి’ పాటతో సహా ఇప్పటివరకు వచ్చిన అన్ని పాటలకూ మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ఎప్పుడు జరగబోతోంది, ఏ సెలెబ్రిటీస్ పాల్గొనబోతున్నారు అంటూ ఆరాలు మొదలయ్యాయి. అయితే ‘రాధేశ్యామ్’ టీమ్ మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ప్రభాస్ అభిమానులే చీఫ్ గెస్టులని చెబుతోంది. డిసెంబర్ 23న రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుక జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులే ఈ ఈవెంట్‌కి అతిథులని, వాళ్ల చేతుల మీదుగానే ఐదు భాషల ట్రైలర్స్‌నీ విడుదల చేయిస్తామని అనౌన్స్ చేశారు. అయితే ప్రీ రిలీజ్‌కి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ రూల్స్ పాటించాలని మేకర్స్ చెబుతున్నారు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.