రాడిసన్‌‌ డ్రగ్స్‌‌ కేసుతో టాలీవుడ్​కు లింక్‌‌

రాడిసన్‌‌ డ్రగ్స్‌‌ కేసుతో టాలీవుడ్​కు లింక్‌‌

 డ్రగ్స్ తీసుకున్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తు
అనుమానితులుగా డైరెక్టర్‌‌  క్రిష్‌‌, లిషి, శ్వేత
పోలీసుల అదుపులో డ్రగ్స్ సప్లయర్  అబ్బాస్
వివేకానందకు పదిసార్లు డ్రగ్స్ సప్లయ్‌‌  చేశానని వెల్లడి

హైదరాబాద్‌‌,వెలుగు: రాడిసన్  హోటల్‌‌లో జరిగిన డ్రగ్స్‌‌ పార్టీలో మరోసారి టాలీవుడ్‌‌  లింకులు బయటపడ్డాయి. డైరెక్టర్  జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్  క్రిష్‌‌  సహా సినీ నటులు లిషి, శ్వేతను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని తేల్చేందుకు డ్రగ్‌‌ టెస్ట్, బ్లడ్‌‌  సాంపిల్‌‌  తీసుకోనున్నారు. రాడిసన్  హోటల్‌‌ కేంద్రంగా డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నట్లు గుర్తించారు. హోటల్‌‌పైనా కేసు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టారు. గచ్చిబౌలిలోని రాడిసన్  హోటల్‌‌లో ఆదివారం డ్రగ్స్ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. 

ఆ హోటల్‌‌ యజమాని కుమారుడు, మంజీరా గ్రూప్  ఆఫ్  కంపెనీస్ డైరెక్టర్  గజ్జల వివేకానంద ఆ పార్టీ నిర్వహించారని పోలీసులు గుర్తించారు. మూడు కొకైన్‌‌  డ్రగ్‌‌  కవర్స్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే డ్రగ్స్ సప్లయర్‌‌‌‌  సయ్యద్‌‌  అబ్బాస్  జాఫ్రీని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌‌ ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు, ఎవరెవరికి  సప్లయ్ చేశాడు అన్న వివరాలు రాబడుతున్నారు. వివేకానందకు పదిసార్లు డ్రగ్స్‌‌ అందించానని జాఫ్రీ తెలిపాడు. రాడిసన్  హోటల్‌‌లో ఇలాంటి డ్రగ్స్ పార్టీలు గతంలో కూడా జరిగాయని అతను వెల్లడించాడు. 

ప్రతి పార్టీలో 4 గ్రాముల చొప్పున కొకైన్  సప్లయ్ చేశానని అబ్బాస్  తన స్టేట్‌‌మెంట్‌‌లో తెలిపాడు. అతను తెలిపిన వివరాల ఆధారంగా వివేకానంద నిర్వహించిన డ్రగ్స్  పార్టీలపై పోలీసులు దృష్టి పెట్టారు. అబ్బాస్‌‌, వివేకానంద కాల్‌‌ డేటా సేకరిస్తున్నారు. కోర్టులో డిపాజిట్ చేసిన వివేకానంద  ఫోన్‌‌ను పరిశీలించనున్నారు. వాట్సాప్‌‌, ఇతర సోషల్‌‌ మీడియా అకౌంట్ల ద్వారా డ్రగ్స్  నెట్‌‌వర్క్‌‌ను గుర్తించనున్నారు. 

వివేకాతో పాటు అతని ఫ్రెండ్స్ కు టెస్టులు

డ్రగ్స్‌‌ తీసుకున్నారనే అనుమానంతో వివేకానందతో పాటు అతని ఫ్రెండ్స్‌‌ నిర్భయ్‌‌, కేదార్‌‌‌‌నాథ్ కు పోలీసులు డ్రగ్స్ పరీక్షలు చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే డైరెక్టర్  క్రిష్‌‌ జాగర్లమూడి, లిష, శ్వేత, వివేకానంద ఫ్రెండ్స్‌‌  సందీప్‌‌, రఘుచరణ్‌‌, నెయిల్‌‌లు కూడా కొకైన్ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారిని విచారించేందుకు ఏర్పాట్లు చేశారు. విచారణకు హాజరుకావాలని వారికి పోలీసులు సమాచారం అందించారు. అనుమానితులందరికీ టెస్టులు చేస్తామని డీసీపీ వినీత్  తెలిపారు. డ్రగ్స్  తీసుకున్నట్లు తేలితే వారిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

నేను రాడిసన్‌‌కు వెళ్లింది నిజమే.. కానీ: క్రిష్

ఆదివారం నేను రాడిసన్  హోటల్​కు వెళ్లింది నిజమే. కానీ నేను ఎలాంటి పార్టీలో పాల్గొనలేదు. ఆరోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో అక్కడే ఉన్నాను. వివేకానందతో కొద్దిసేపు మాట్లాడాను. 6.45 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఫ్రెండ్స్‌‌ను కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లాను. ఈ విషయాలను పోలీసులకు తెలిపాను. వారు స్టేట్‌‌మెంట్‌‌ ఇవ్వాలని చెప్పారు. విచారణకు సహకరిస్తా.