సిద్దిపేట కలెక్టర్ ​ఆఫీసులో సర్పంచ్​లతో  రఘునందన్​ రావు ధర్నా

సిద్దిపేట కలెక్టర్ ​ఆఫీసులో సర్పంచ్​లతో  రఘునందన్​ రావు ధర్నా

 

  • సిద్దిపేట కలెక్టర్ ​ఆఫీసులో సర్పంచ్​లతో రఘునందన్​ రావు ధర్నా
  • సెంట్రల్ ​ఫండ్స్ పంపిణీలో వివక్ష చూపుతున్నారని ఫైర్

సిద్దిపేట రూరల్, వెలుగు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీం కింద కేంద్రం జిల్లాలకు రిలీజ్​ చేసిన నిధులను టీఆర్ఎస్ సర్పంచ్ లకు మాత్రమే ఇస్తున్నారని, బీజేపీ సర్పంచ్ లకు ఇవ్వడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. సోమవారం దుబ్బాక నియోజకవర్గానికి చెందిన16 మంది బీజేపీ సర్పంచ్ లతో కలిసి ఆయన సిద్దిపేట కలెక్టరేట్​ వెళ్లారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ లేకపోవడంతో కలెక్టర్ ​చాంబర్ ​ముందు సర్పంచ్ లతో కలిసి నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ మాట మాట్లాడితే కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని అంటారని, మరి ఆయన చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు నిధులు ఇయ్యకుండా సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లాకు పంచాయతీరాజ్​అధికారులు రూ .53 కోట్ల కేంద్ర నిధులు రిలీజ్​ చేస్తే.. దుబ్బాకకు రూ.3 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఒక్కో మండలానికి రూ. 2.5 కోట్ల చొప్పున దుబ్బాక నియోజకవర్గానికి రూ. 10  కోట్లు రావాల్సి ఉందన్నారు. ఈ నిధుల్లోనూ బీజేపీ సర్పంచుల పేర్లను తొలగించి, కేవలం టీఆర్ఎస్ సర్పంచులకు మాత్రమే ఫండ్స్ ఇచ్చారన్నారు. దుబ్బాకకు రావాలని ఎన్నిసార్లు కోరినా ఆఫీసర్లు రాలేదని, తానే కలెక్టరేట్​కు వస్తే అందుబాటులో లేరని ఫైర్​అయ్యారు. గంటన్నర తర్వాత అడిషనల్ కలెక్టర్ రావడంతో ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.