
నేను ఇలా ట్రాక్టర్ పై సోఫాలో కూర్చుంటా. మీకెందుకు..? అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయం బిల్లుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించింది. ఆ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఓ ట్రాక్టర్ సీటుపై సోఫా వేయించుకొని, అందులో కూర్చున్నారు.
అలా కూర్చోవడంపై బీజేపీ నేతలు ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీ అంటే ఇలా సోఫాలో కూర్చోని చేసేదీ కాదంటూ సెటైర్లు వేశారు. రైతుల్ని మోసం చేసేందుకు ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు.
బీజేపీ ఆరోపణలపై రాహుల్ స్పందించారు. ట్రాక్టర్ పై ఉన్న సోఫాలో కూర్చుంటే తప్పేంటీ..? ప్రధాని రూ.8,400 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఓ అతిపెద్ద లగ్జరీ విమానాన్నే కొనేశారు. ఆయనకు ఆ విమానం లగ్జరీ వస్తువులా కనిపించట్లేదా..? నేను సోఫాలో కూర్చోవడమే కనిపిస్తోందా..? అంటూ విమర్శించారు.
ప్రధాని సమకూర్చుకున్న ఖరీదైన వీవీఐపీ విమానానికి బదులు సియాచిన్ – లఢఖ్‌లో దేశం కోసం పహారా కాస్తున్న సైనికులకు మరిన్ని వసతులు కల్పించవచ్చని పేర్కొన్నారు. ఆ విమానానికి అయిన ఖర్చుతో దాదాపు సైనికులకు వేడినిచ్చే 30 లక్షల దుస్తులు, జాకెట్లు, చేతికి వేసుకునే గ్లౌస్లు 60 లక్షలు, షూస్ 67.20 లక్షలు, ఆక్సిజన్ సిలిండర్లు 16.8 లక్షలు కొనుగోలు చేసి అందించవచ్చని ఆయన ప్రధాని మోడీపై ఎద్దేవా చేశారు.
ఒక్క విమానం కోసం వేలాది కోట్ల రూపాయలను అనవసరం ఖర్చు చేశారన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై బీజేపీ స్పందించింది. నిజానికి ఈ వీవీఐపీ విమానాల ఆర్డర్‌ను ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 2011లోనే ఖరారు చేశారని పేర్కొంది. పలుసార్లు ఈ విమానం కోసం చర్చలు జరిపిన ఎన్డీఎ ప్రభుత్వం 2012లో ఈ ఆర్డర్‌ను ఖరారు చేసుకుందని గుర్తు చేస్తున్నారు.
మరోవైపు నెటిజన్లు సైతం రాహుల్ కూర్చున్న సోఫాపై ట్రోల్ చేస్తున్నారు. మిస్టర్ బీన్ సిరీస్ లో రోవాన్ కారుపై సోఫావేసుకొని కూర్చున్న ఫోటోల్ని షేర్ చేస్తున్నారు.