కాంగ్రెస్‌‌ పార్టీలో 'భారత్​ జోడో' యాత్ర జోష్

కాంగ్రెస్‌‌ పార్టీలో 'భారత్​ జోడో' యాత్ర జోష్

మహబూబ్​నగర్​, వెలుగు :కాంగ్రెస్‌‌ పార్టీలో ‘భారత్​ జోడో’ యాత్ర జోష్ కనిపిస్తోంది.  ఏఐసీసీ నేత రాహుల్​గాంధీ  చేపట్టిన పాద యాత్ర  ఆదివారం కర్నాటక నుంచి  నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని టైరోడ్డు బ్రిడ్జి మీదుగా రాష్ట్రంలోకి ఎంటర్‌‌‌‌ కానుంది.  ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో లీడర్లు పలుమార్లు రూట్‌‌మ్యాప్‌‌ను పరిశీలించి...కేడర్‌‌‌‌కు దిశానిర్దేశం చేశారు. శనివారం పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి టై రోడ్డు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.  

ఉమ్మడి పాలమూరులో 134 కిలోమీటర్లు 

మక్తల్​, దేవరకద్ర, మహబూబ్​నగర్​, జడ్చర్ల, షాద్​నగర్​ నియోజకవర్గాల మీదుగా దాదాపు 134 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది.  యాత్ర మొదటి రోజు కృష్ణా బ్రిడ్జి మీదుగా మక్తల్​ చేరుకొని... సబ్​ స్టేషన్​ వద్ద నైట్​హాల్ట్​ చేయనున్నారు. దీపావళి కావడంతో 24, 25, 26వ తేదీల్లో యాత్రకు బ్రేక్​ ఇవ్వనున్నారు. తిరిగి 27న మక్తల్​ నుంచి యాత్ర మొదలు  పెట్టి  మరికల్​, మన్యంకొండ,  మహబూబ్​నగర్​ , జడ్చర్ల,  బాలానగర్‌‌‌‌ మీదుగా 30న రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌‌లో అడుగు పెట్టనున్నారు.

యాత్ర సక్సెస్​ చేసేందుకు కార్యాచరణ

రాహుల్​ గాంధీ యాత్ర సక్సెస్​ చేసేందుకు  లీడర్లు ముందస్తు కార్యాచరణ చేపట్టారు. రెండు వారాలుగా యాత్ర వెళ్లే మార్గాల్లో రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్​, పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, సీనియర్లు హన్మంత్‌‌రావు, చిన్నారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవి పర్యటించారు. జన సమీకరణ బాధ్యతలను మక్తల్​, దేవరకద్ర, మహబూబ్​నగర్​, జడ్చర్ల, షాద్​నగర్​ నియోజకవర్గాలకు చెందిన లీడర్లు కె.ప్రశాంత్​రెడ్డి, జి.మధుసూదన్​రెడ్డి, ఒబదేల్లా కొత్వాల్​, సంజీవ్​ ముదిరాజ్​, జనుంపల్లి అనిరుధ్​రెడ్డి, ఎర్రశేఖర్​, వీర్లపల్లి శంకర్‌‌‌‌కు అప్పగించారు.   స్థానిక సమస్యలు,  అధికార పార్టీ ఆగడాలపై నోట్​ ప్రిపేర్​ చేసి రాహుల్​ గాంధీకి ఇవ్వనున్నట్లు తెలిసింది. దీనిపైనే ఆయన  మీటింగుల్లో మాట్లాడనున్నట్లు సమాచారం. 

413 మందితో బందోబస్తు

మక్తల్, వెలుగు: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు 413 మంది పోలీసులతో  బందోబస్తు ఏర్పాటు చేసినట్లు  ఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. శనివారం  కృష్ణా మండల కేంద్రంలోని బసవేశ్వర ఫంక్షన్​ హాల్​లో పోలీస్​ అధికారులు, సిబ్బందితో మీటింగ్​ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలుగురు  డీఎస్పీలు, 13 మంది సీఐలు, 34 మంది ఎస్సై, ఏఎస్సైలు, 96 మంది హెడ్​కానిస్టేబుల్స్‌‌, 219 మంది కానిస్టేబుల్స్‌‌, 46 మంది హోంగార్డులు, నాలుగు రూప్​ పార్టీలు, నాలుగు బీడీ టీంలు మొత్తం 413 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.  మొత్తం ఆరు సెక్టార్లుగా విభజించామని,  ప్రతి సెక్టార్‌‌‌‌కు డీఎస్పీ ఇన్‌‌చార్జిగా ఉంటారని చెప్పారు.  ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసి  వెహికిల్స్‌‌ మళ్లించాలని సూచించారు.  ఈ మీటింగ్‌‌లో అడిషనల్​ ఎస్పీ భరత్, డీఎస్పీలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

పూర్వ వైభవంపై ఆశలు

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్​కు కంచుకోటగా ఉండేది. 2004లో జరిగిన ఎన్నికల్లో 14 నియోజకవర్గాల్లో దాదాపు 10 మంది  ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ముగ్గురు, 2014లో ఐదుగురు విజయం సాధించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో ఒకేఒక్క స్థానంలో విజయం సాధించినా.. ఆ ఎమ్మెల్యే  టీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరారు.  దీంతో కాంగ్రెస్​ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు.  ప్రస్తుతం  రాహుల్​ గాంధీ  పర్యటిస్తుండడంతో పూర్వవైభవం వస్తుందని పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు.