దళితుడైతే అణిచేస్తున్నరు..ఎంత సక్సెస్ సాధించినా వివక్ష తప్పట్లేదు: రాహుల్ గాంధీ

దళితుడైతే  అణిచేస్తున్నరు..ఎంత సక్సెస్ సాధించినా వివక్ష తప్పట్లేదు: రాహుల్ గాంధీ
  • కుల వివక్ష వల్లే ఐపీఎస్​ ఆఫీసర్​ పూరన్ సూసైడ్ చేసుకున్నడు
  • డీజీపీ, ఎస్పీని అరెస్ట్ చేయాల్సిందే.. కొన్నేండ్లుగా కులం పేరుతో దూషించారు
  • న్యాయం జరిగేదాకా కొట్లాడుతామని వ్యాఖ్య.. పూరన్ ఫ్యామిలీకి పరామర్శ

చండీగఢ్: జీవితంలో ఎంత సక్సెస్ సాధించినా.. ఎంత ఇంటెలిజెంట్​గా ఉన్నా.. అతను దళితుడు అయితే చాలు అణిచివేతకు గురవుతున్నాడని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. హర్యానా ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య.. దళితుల గౌరవానికి సంబంధించిన అంశమని తెలిపారు. ఆయన మృతికి కారణమైన అందరినీ కఠినంగా శిక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నాయబ్ సింగ్ సైనీని డిమాండ్ చేశారు. 

సెక్టార్ 24లో నివాసం ఉంటున్న పూరన్ కుమార్ కుటుంబాన్ని మంగళవారం రాహుల్ గాంధీ కలిసి సానుభూతి ప్రకటించారు. సీనియర్ ఐఏఎస్ అయిన ఆయన భార్య అమ్నీత్ పి.కుమార్, ఇద్దరు కూతుళ్లు, ఫ్యామిలీ మెంబర్స్​ను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కుల వివక్ష కారణంగా సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. 

కులం పేరుతో ఆయన్ను దూషించడంతోనే చనిపోయారు. సూసైడ్ లెటర్​లో ఆయన ప్రస్తావించిన 8 మంది సీనియర్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, హర్యానా సీఎం సైనీని డిమాండ్ చేస్తున్న. ఉన్నతాధికారులంతా పూరన్​ను మెంటల్ టార్చర్ చేశారు. బహిరంగంగా కులం పేరుతో దూషించారు. దళితుడైతే చాలు.. అతన్ని అణిచివేసి.. తొక్కేస్తున్నరు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు’’అని రాహుల్ అన్నారు.

ఇద్దరు కూతుళ్లు ఒత్తిడిలో ఉన్నరు

తండ్రిని పోగొట్టుకున్న పూరన్ కుమార్ ఇద్దరు కూతుళ్లు ఎంతో ఒత్తిడికి గురవుతున్నారని రాహుల్ అన్నారు. ‘‘రోజులు గడుస్తున్నా.. బాధిత కుటుంబానికి న్యాయం జరగడం లేదు. పూరన్ కుమార్ నిజాయితీ గల ఆఫీసర్. అతని కెరీర్‌‌ను, ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇతర అధికారులు కొన్నేండ్లుగా వివక్ష కొనసాగించారని స్పష్టంగా తెలుస్తున్నది. ఇది కేవలం ఒక దళిత కుటుంబానికి సంబంధించినది కాదు. 

దేశంలోని కోట్లాది మంది దళితులకు సంబంధించిన అంశం. దళిత అధికారిపై సిస్టమాటిక్ డిస్క్రిమినేషన్ జరిగింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. న్యాయం కోసం కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అందుకే పూరన్ డెడ్​బాడీకి పోస్టుమార్టం చేయకుండా.. ఇంకా మార్చురీలోనే ఉంచారు. డీజీపీ కపూర్​ను లీవ్​పై పంపారు. 

రోహ్​తక్ ఎస్పీ బిజార్నియాను సస్పెండ్​ చేశారు. ఇది సరిపోదు.. బాధ్యులైన వీరిద్దరి పేర్లను ఎఫ్​ఐఆర్​లో చేర్చి.. అరెస్ట్ చేయాలి. అప్పటి దాకా కొట్లాడుతాం’’ అని రాహుల్ డిమాండ్ చేశారు.