కాళేశ్వరం కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలా మారింది : రాహుల్ గాంధీ

కాళేశ్వరం కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలా మారింది :  రాహుల్ గాంధీ

భూపాలపల్లి/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయల రాష్ట్ర సంపదను దోచుకుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇవాళ మేడిగడ్డ బరాజ్ ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఏంలా మారిందన్నారు. ఈ ఎన్నికలు ప్రజల తెలంగాణకు.. దొరల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని వ్యాఖ్యనించారు. లక్ష కోట్ల రాష్ట్ర సంపదను దోచుకున్న కేసీఆర్ సర్కారు.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ సొమ్మను రికవరీ చేసి ప్రజలకు ఇచ్చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2500 అందించనున్నామని చెప్పారు. మోదీ, కేసీఆర్ పాలనలో సిలిండర్ ధర రూ.12 వందలకు చేరిందని విమర్శించారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని పునరుద్ఘాటించారు. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయని అన్నారు. 25వ పిల్లర్ నుంచి 1వ పిల్లర్ వరకు పూర్తిగా కుంగిపోయిందని చెప్పారు. పిల్లర్స్ రెండున్నర ఫీట్లు కుంగిపోయిందని అధికారులే స్వయంగా చెబుతున్నారని తెలిపారు. మేడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మిగతా సగం ప్రాజెక్టు పరిస్థితి కూడా సాంకేతిక నిపుణులు పరిశీలిస్తే తప్ప ఏంటనేది తెలుస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేసిన ఎల్ అండ్ టీ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. 

సంబంధిత ఇంజనీర్లు, సీడీఓ పై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుడినీ గుడిలో లింగాన్ని దిగమింగిన కేసీఆర్ ను తెలంగాణ సమాజం శిక్షించాలని కోరారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగి కేసీఆర్ పాపం పండిందని, ఆయన అవినీతి కుండ పగిలిందని రేవంత్ అన్నారు. బీఆరెస్ అవినీతిని బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఓడిపోతారని బీఆరెస్ కు స్పష్టత వచ్చిందని, అందుకే కేసీఆర్ కేంద్రం సహకారంతో కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు చేస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించి తీరుతామని చెప్పారు. మోదీ కంకణం కట్టుకొని కేసీఆర్ ను గెలిపించాలనుకున్నా అది జరగని పని అని పేర్కొన్నారు. సభలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే, మంథని అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :- రైతుబంధు అనే మాట నా నోట్లో నుంచి వచ్చింది : నిర్మల్ సభలో కేసీఆర్