జోడు పదవులపై రాహుల్ గాంధీ క్లారిటీ

జోడు పదవులపై రాహుల్ గాంధీ క్లారిటీ

కొచ్చి: పార్టీలో జోడు పదవుల వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఒక వ్యక్తి, ఒకే పదవి నియమాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజస్థాన్ ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ చేసిన డిక్లరేషన్ను రాహుల్ గాంధీ గుర్తు చేశారు. పార్టీ అధ్యక్ష పదవితో పాటు రాజస్థాన్ సీఎం కొనసాగేందుకు సిద్ధమన్న అశోక్ గెహ్లాట్  వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

ఉదయ్‌పూర్‌ ఒప్పందం ప్రకారం ఒక్కరికి ఒక్క పోస్టు మాత్రమే వర్తిస్తుందని రాహుల్‌ చెప్పారు. కాంగ్రెస్‌ చీఫ్‌ పదవి ఓ ఐడియాలజికల్‌ పోస్టు అని, కొన్ని ఐడియాలకు ప్రతిరూపమని, ఓ నమ్మకమైన వ్యవస్థకు నిదర్శనమని అన్నారు. రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ యూ టర్న్ తీసుకున్నారు. భారత్ జోడో యాత్రలో భాగస్వాములయ్యేందుకు కొచ్చికి వెళ్లిన ఆయన.. మాట మార్చారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే వ్యక్తి  కేవలం ఒక పదవికే పరిమితం కావడం మంచిదని అన్నారు. 

ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మనీశ్‌ తివారి, మల్లిఖార్జున ఖర్గే, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సైతం కాంగ్రెస్‌ చీఫ్‌ పోస్టుకు పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అశోక్‌ గెహ్లాట్‌, శశి థరూర్‌, కమల్‌నాథ్‌ పార్టీ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు.