శాఖలన్నీ కేసీఆర్ ఫ్యామిలీ చేతిలోనే.. తప్పుడు హామీ ఇవ్వడానికి నేను మోదీ కాదు

శాఖలన్నీ  కేసీఆర్ ఫ్యామిలీ చేతిలోనే.. తప్పుడు హామీ ఇవ్వడానికి నేను మోదీ కాదు

ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలంతా కలగన్నారని.. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక కుటుంబానికే మేలు జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మూడు రోజుల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం(నవంబర్ 1) కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో రాజుల పాలన నడుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయలు దోచుకుందని.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని రాహుల్ ఆరోపించారు.

దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణకు మధ్య పోటీ నడుస్తోందని...  అవినీతి కుటుంబం ఓ పక్క.. ప్రజలు మరో పక్క ఉన్నారని చెప్పారు.  వచ్చిన తెలంగాణలో పదవులు, ఉద్యోగాలు అన్ని కేసీఆర్ కుటుంబానికే దక్కాయని విమర్శించారు.  రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినవేనని..  ప్రాజెక్టుల ద్వారా నిర్వాసితులైన ప్రజలకు ఇళ్లు, భూములు ఇచ్చి కాంగ్రెస్ ఆదుకుందని చెప్పారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో భారీ ప్రాజెక్టులు నిర్మించిందని.. కానీ, రూ.లక్షన్నర కోట్లతో కేసీఆర్ కట్టిన కాళేళ్వరం ప్రాజెక్టుకు అప్పుడే బీటలు పడుతుందని..కాళేళ్వరం పిల్లర్లన్నీ ఒక్కొక్కటిగా కూలుతున్నాయని  రాహుల్ అన్నారు.

రాష్ట్రంలో దళితులకు, బలహీనవర్గాలకు కాంగ్రెస్ భూములు పంచిందని, కేసీఆర్.. ధరణి పోర్టల్ తీసుకొచ్చి గతంలో కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన భూములను లాక్కున్నారని  ఆయన మండిపడ్డారు. ధరణి వల్ల ఒకే ఫ్యామిలీ బాగుపడిందని విమర్శించారు. కీలక శాఖలన్నీ కేసీఆర్ ఫ్యామిలీ చేతిలో ఉన్నాయి..  ముందు కేసీఆర్ ను సిఎం కుర్చిలో నుంచి దించి బైబై చెప్పాలని ప్రజలకు రాహుల్ పిలుపునిచ్చారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత  కేసీఆర్ దోచుకున్న సొమ్మునంతా కక్కించి ప్రజలకు పంచుతామన్నారు.  తప్పుడు హామీలు ఇవ్వడానికి తాను.. కేసీఆర్, మోదీలను కానన్నారు. అధికారంలోకి వస్తే రూ.500కే సిలిండర్ తోపాటు మహిళలందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని..ఇచ్చిన ప్రతీ హామీని నేరవేరుస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.