రైల్వే ఐసోలేషన్ వార్డులున్నా..వాడుకుంటలే

రైల్వే ఐసోలేషన్ వార్డులున్నా..వాడుకుంటలే

రైల్వే ఆఫీసర్లను అడగని రాష్ట్ర సర్కార్ 
అందుబాటులో 130 కోచ్​లు.. 2 వేల బెడ్స్ 

హైదరాబాద్, వెలుగు: కరోనా పేషెంట్ల కోసం రైల్వే ఐసోలేషన్ వార్డులు అందుబాటులో ఉన్నా, రాష్ర్ట ప్రభుత్వం వాటిని వాడుకోవడం లేదు. సౌత్ సెంట్రల్ రైల్వే 130 కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా మార్చింది. వాటిలో 2 వేల మందికి పైగా ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అడిగితే వెంటనే ఇచ్చేందుకు తాము రెడీగా ఉన్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. కానీ రాష్ట్ర సర్కార్ మాత్రం ఇప్పటి వరకు రైల్వే అధికారులను సంప్రదించలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం బెడ్స్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే ఐసోలేషన్ వార్డులను వాడుకుంటే ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ రాష్ట్ర సర్కార్ మాత్రం.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతమున్న 130 ఐసోలేషన్ కోచ్ లలో.. ఒక్కో కోచ్ లో 16 మందికి ట్రీట్ మెంట్ ఇవ్వొచ్చని,  రాష్ట్రంలోని ఏ స్టేషన్ కు సమీపంలోనైనా వీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నారు.  
అన్ని సౌలతులతో.. 
కరోనా ట్రీట్ మెంట్ కు అవసరమైన అన్ని సౌలతులను ఈ కోచ్ లలో కల్పించారు. ప్రతి కోచ్‌లో బాత్‌రూమ్స్, ఫ్లోటింగ్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. పేషెంట్లు సామగ్రి పెట్టుకునేందుకు ప్రత్యేక అల్మారాలు పెట్టారు. మెడికల్ ఎక్విప్ మెంట్ అవసరమైన కరెంట్ కోసం 220 వోల్ట్‌ విద్యుత్‌ ను అనుసంధానం చేశారు. ఫ్యాన్స్ తో  కొన్ని చోట్ల ఏసీలు కూడా ఏర్పాటు చేశారు. ట్రీట్ మెంట్ కు అవసరమయ్యే ఎక్విప్ మెంట్ ను అధికారులు సిద్ధం చేశారు. బెడ్ షీట్స్, ఆక్సిజన్ సిలిండర్లు ఇతర మెటీరియల్ ను అందుబాటులో ఉంచారు. రాష్ర్ట ప్రభుత్వం చర్చిస్తే వెంటిలేటర్  పెట్టే ప్లాన్ చేస్తున్నారు. 

సర్కార్ అడిగితే ఇస్తం..
ప్రస్తుతం 130 దాకా ఐసోలేషన్ కోచ్ లు రెడీగా ఉన్నాయి. ఒక్కో కోచ్ లో 16 మందికి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇతర రాష్ర్టాల్లో ఐసోలేషన్ కోచ్ లలో ట్రీట్ మెంట్ జరుగుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ప్రపోజల్స్ రాలేదు. ప్రభుత్వం అడిగితే మేం ఇస్తాం. అవరమైతే మరిన్ని కోచ్ లు రూపొందిస్తాం.                         - రాకేశ్​ కుమార్, సీపీఆర్వో, ఎస్సీఆర్