డేంజర్​జోన్‌‌లుగా రైల్వే అండర్​ బ్రిడ్జిలు

డేంజర్​జోన్‌‌లుగా రైల్వే అండర్​ బ్రిడ్జిలు
  • మెయింటెనెన్స్‌‌ లేక జామ్ అవుతున్న నీళ్లు 
  • గ్రామాల మధ్య నిలిచిపోతున్న రాకపోకలు
  • ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • పట్టించుకోని రైల్వే, ఆర్‌‌‌‌అండ్‌‌బీ అధికారులు

మహబూబ్​నగర్​, వెలుగు : రైల్వే అండర్​ బ్రిడ్జి (ఆర్‌‌‌‌యూబీ)లు డేంజర్​జోన్‌‌లుగా మారుతున్నాయి. వీటిని మెయిం​టెనెన్స్ చేయకపోవడంతో  మోరీలు జామ్​ అయ్యి నీళ్లు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పదుల ఆర్‌‌‌‌యూబీల్లోకి నీళ్లు చేరి ప్రజల  ఇబ్బందులు పడ్డారు. వర్షం పడ్డ ప్రతిసారి పదుల సంఖ్యలో గ్రామాలకు మూడునాలుగు రోజుల పాటు రాకపోకలు బంద్ అవుతున్నాయి.  అధికారులు కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు. 

మూడు జిల్లాల మీదుగా రైల్వే లైన్

మహబూబ్​నగర్​, వనపర్తి,  గద్వాల జిల్లాల్లో రైల్​ రూట్లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఉండే రైల్వే గేట్ల స్థానంలో రైల్వే ఓవర్​ బ్రిడ్జి (ఆర్వోబీ),   పల్లె ప్రాంతాల్లోని రైల్వే గేట్ల వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్‌‌‌‌యూబీ)లను ఏర్పాటు చేశారు.  గద్వాల జిల్లా పరిధిలో గోపాల్​దిన్నె, వల్లూరు, నారాయణపురం, మేళ్లచెర్వు, వెంకంపల్లి, వనపర్తి జిల్లా పరిధిలో నెల్విడిగేట్​, శ్రీరామ్​నగర్, పాలమూరు జిల్లా పరిధిలో పెద్దాయపల్లి, బాలానగర్​, రాజాపూర్​, ముదిరెడ్డిపల్లి, గొల్లపల్లి, న్యూమోతినగర్​, ఏనుగొండ, సూగూరుగడ్డ, డోకూరు, దేవరకద్ర, వెంకటాయపల్లి, కౌకుంట్ల ప్రాంతాల్లో ఆర్​యూబీలు ఉన్నాయి.   ఇందులో కౌకుంట్ల ఆర్‌‌‌‌యూబీ నుంచి రాజోలి, అప్పంపల్లి, ముచ్చింతల, డోకూరు ఆర్‌‌‌‌యూబీ నుంచి జీనుగురాల, నందిపేట, వెంకటాయపల్లి నుంచి గద్దెగూడెం, దేవరకద్ర, గొల్లపల్లి నుంచి మర్రిచెట్టుతండా, స్టేషన్​తండా, ఈర్లపల్లి, లింగంపేట్‌‌ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. సూగూరుగడ్డ ఆర్‌‌‌‌యూబీ నుంచి మణికొండ, రామచంద్రాపూర్​, మాచన్​పల్లి, అప్పాయిపల్లి, కోడూరు, పెద్దాయపల్లి నుంచి శేరిగూడెం, బాలానగర్​ నుంచి గౌతాపూర్​, అప్పాజిపల్లి, పెద్దరేవల్లి, చిన్నరేవల్లి, రాజాపూర్​ నుంచి మల్లేపల్లి, ఈద్గాన్​పల్లి, కల్లేపల్లి, ముదిరెడ్డిపల్లి నుంచి నందిగామ, లింగంపేట, కోడ్గల్​గ్రామాలకు వెళ్తున్నారు.  వర్షం పడిన ప్రతిసారి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఈ ఆర్‌‌‌‌యూబీల్లోకి వచ్చి చేరుతోంది.  

నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేక..

రూల్‌‌ ప్రకారం ఆర్‌‌‌‌యూబీని ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతం నుంచి కిలోమీటర్‌‌‌‌ దూరంలో నీటి కుంట లేదా బావిని తవ్వాలి. ఆర్​యూబీ పూర్తి అయ్యాక అక్కడి నుంచి మోరీలు , అండర్​ గ్రౌండ్​ పైప్​లైన్​ను ఏర్పాటు చేసి  కుంట, బావులకు లింక్​ చేయాలి. వర్షాలు కురిసినప్పుడు నీళ్లు సాఫీగా వెళ్తున్నాయో.. లేవో..? చూసుకోవాలి.  కానీ, కాంట్రాక్టర్లు, రైల్వే ఆఫీసర్లు బావులు తవ్వినా మెయింటెనెన్స్‌‌ చేయడం లేదు.  కొన్నిచోట్ల వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గ్రిల్స్ జామ్‌‌​అయ్యాయి. మరికొన్ని చోట్ల తవ్విన కుంటలు, బావులు కూడా నిండిపోవడంతో నీరు బయటికి వెళ్తే పరిస్థితి లేకుండా పోయింది. అయినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.  ఆర్‌‌‌‌యూబీల్లో చేరిన నీటిని మోటార్ల ద్వారా  బయటకు తోడాల్సి ఉన్నా.. అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 

వానొస్తే పరేషానే..

రాజాపూర్​ వద్ద ఉన్న ఆర్‌‌‌‌యూబీ నుంచే మా ఊరికి పోవాలె. వానొచ్చిందంటే ఆ రూట్లో పోవాలంటే భయం అయితది. పై నుంచి వచ్చే నీళ్లన్ని ఆర్​యూబీలోనే ఆగుతున్నయ్​. బండ్ల మీద పోతుంటే ఆగిపోతున్నయ్​. ప్రతిఏటా మాకు ఇదే పరేషాన్​.  

- దారమోని శేఖర్, ఈద్గాన్​పల్లి, రాజాపూర్​ మండలం

పరిష్కారం చూపాలె..

నేను ఆటో నడుపుకుంటూ  కుటుంబాన్ని పోషించుకుంటున్న. రోజూ వెంకటాయపల్లి నుంచి ప్యాసింజర్లను తీసుకొని దేవరకద్ర పోత. వర్షాలు పడ్డాయంటే వెంకటాయపల్లి వద్ద ఆర్​యూబీలోకి నీళ్లు వస్తయి. అప్పుడు దడ పుడుతుంది.  

- రమేశ్​, ఆటో డ్రైవర్​, వెంకటాయపల్లి, దేవరకద్ర మండలం