
- జిల్లాలో వర్షాభావ పరిస్థితులు
- 1155 చెరువుల్లో నిండింది 60
- 120 చెరువుల్లో సగానికిపైగా వాటర్
- వరి సాగుపై ప్రభావం
యాదాద్రి, వెలుగు : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గత నెల చివరి వారం నుంచి అడపాదడపా వానలు కురిసినా జూలై నెలాఖరు వరకు లోటు వర్షపాతమే నమోదు అయింది. జూన్ నుంచి జూలై వరకు 234.1 ఎంఎం వాన కురియాల్సి ఉండగా, 225.3 ఎంఎం మాత్రమే కురిసింది. ఈ వారంలో పలుమార్లు భారీ వానలు కురిసింది. దీంతో ఆత్మకూరు, మోటకొండూరు, ఆలేరు, అడ్డగూడూరు మండలాల్లో కొంతమేర చెరువుల్లోకి నీరు చేరింది.
చెరువుల్లో చేరని నీరు..
జిల్లాలో మూసీ తప్ప మరో నది ప్రవాహం లేనందున బోరు బావులు, బావులు, చెరువుల మీద ఆధారపడి ఎక్కువ మంది రైతులు సాగు చేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం యాదాద్రి జిల్లాలో కుంటలు సహా 1155 చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 60 వేల ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. అయితే వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచింది. ఇప్పటివరకు కొన్ని చెరువుల్లో చుక్క నీరు కూడా చేరలేదు.
చాలా చెరువులు ఎండిపోగా, సగానికి పైగా చెరువుల్లో 10 నుంచి 25 శాతం నీరు కూడా లేదు. వీటిలో దాదాపు 60 చెరువుల్లో మాత్రమే వంద శాతం నీరు చేరిందని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ చెరువులు కూడా ఎక్కువగా మూసీ కాల్వల పరిధిలోనివే. మరో 76 చెరువుల్లో 75 శాతానికి పైగా నీరు ఉందని, మరో 120 చెరువుల్లో 50 శాతానికి పైగా నీరు, 190 చెరువుల్లో 25 శాతం నీరు చేరిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
తగ్గిన వరిసాగు..
సరైన సమయంలో వానలు కురియకపోవడంతో ఈసారి సాగుపై ప్రభావం చూపింది. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇంకా నాట్లు వేయలేదు. నాట్లు వేయడానికి మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే కొందరి రైతులు వేసిన నారు ముదిరిపోయింది. దీంతో కొద్ది ఎకరాల్లో మాత్రమే సాగు చేసి, మిగతా భూమి సాగు చేయకుండా వదిలేశారు. ఈసారి 3 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేస్తారని అగ్రికల్చర్డిపార్ట్మెంట్లెక్కలు వేసింది. అయితే ఇప్పటివరకు 1.40 లక్షల ఎకరాల్లోనే నాట్లు వేశారు.