
తమిళనాడులోని చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో రాబోయే 24 నుంచి 36గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ 17, 18న భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇటీవల సంభవించిన మిచైంగ్ తుఫాను తమిళనాడుపై భారీ ప్రభావం చూపించింది. ఈ వర్షాలకు చాలా ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి.
తూత్తుకూడి, రామనాథపూరం, పుదుక్కొటై, శివగంగ సహా నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తూ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దాంతో పాటు కన్యాకుమారి. తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మధురై, మైలాడుతురై, తెన్కాసి, విరుదునగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆర్ఎంసీ రాబోయే రెండు రోజుల్లో పలు నిర్దిష్ట ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. కోస్తా తమిళనాడు, డెల్టా ప్రాంతాల్లో మరో 5రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.