Rain Threat IND vs SL: జపాన్ లోని ఐచినగాయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడలలో (Asian Games 2026) మెన్స్ క్రికెట్ టోర్నమెంట్ అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. అయితే ఇప్పటి వరకు వర్షం కారణంగా టోర్నీ కొనసాగుతున్న తీరు క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. నాకౌట్ దశలో ఏ ఒక్క క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా జరగకుండానే వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో రేపు (అక్టోబర్ 1, గురువారం ) జరగాల్సిన తొలి సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది.
వర్షం పడితే గెలుపు ఎవరిది:
జపాన్ లోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లన్నీ పూర్తిగా క్యాన్సిల్ అయ్యాయి. భారత్ - ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ - హాంకాంగ్, శ్రీలంక - నేపాల్, బంగ్లాదేశ్ - మలేషియా జట్ల మధ్య జరగాల్సిన నాలుగు క్వార్టర్స్ వర్షంతో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. దీంతో టోర్నమెంట్ రూల్స్ ప్రకారం ఐసీసి టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగ్గా ఉన్న జట్లు నేరుగా సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి.
ఇదే రూల్ సెమీఫైనల్స్, ఫైనల్‌కు కూడా వర్తిస్తుంది. ఒకవేళ రేపు జరగబోయే భారత్ - శ్రీలంక సెమీఫైనల్ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డుపడి, మ్యాచ్ రద్దయితే.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీలంక కంటే మెరుగైన స్థానంలో ఉన్న భారత జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మరొక సెమీఫైనల్‌లో పాకిస్థాన్ - బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.
రేపటి వాతావరణ రిపోర్ట్:
క్రికెట్ అభిమానులకు ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. అక్యువెదర్ (Accuweather) నివేదిక ప్రకారం రేపు (అక్టోబర్ 1, గురువారం) వర్షం పడే అవకాశం లేనట్లు తెలుస్తుంది. ఆకాశం మేఘావృతమై ఉండే ఛాన్స్ ఉన్నప్పటికీ, వర్షం పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తలేవ్. ఉష్ణోగ్రత సుమారు 20 డిగ్రీల సెల్సియస్ దగ్గర చల్లగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ, గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రౌండ్, అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండే అవకాశం ఉంది. టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు, ఈసారైనా ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి స్థాయి మ్యాచ్‌ను ఆడి గెలవాలని పట్టుదలతో ఉంది.
►ALSO READ | వెస్టిండీస్ క్రికెటర్కు ఏమైంది: ఒంటిపై ఉన్న ఆ మచ్చల వెనుక అసలు ముచ్చట ఇదే!
