ఇండ్ల మధ్య నిలుస్తున్న వాన నీళ్లు

ఇండ్ల మధ్య నిలుస్తున్న వాన నీళ్లు

ఖమ్మం సిటీకి చెందిన అక్షయ్ కుటుంబం ఇందిరానగర్​ రోడ్​ నెంబర్–6 లో నివాసం ఉంటోంది. తమ ఇంటి పక్కన  ఖాళీ ప్లాట్ లో వాన నీరు చాలా రోజుల నుంచి నిలిచిపోయి దోమలు వృద్ధి చెందడంతో పాటు పాములు కూడా తిరుగుతున్నాయని మున్సిపల్ అధికారులకు ట్విట్టర్ ద్వారా కంప్లైంట్ చేశాడు. ఆ ట్వీట్ కు మున్సిపల్ కమిషనర్ స్పందించి చర్యలు తీసుకుంటామని రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై కింద నగరానికి చెందిన సాయి కిరణ్​ మరో ట్వీట్ చేశారు. గతేడాది తాను ఇలాగే సారథి నగర్​లోని తమ ఇంటి దగ్గర ఖాళీ స్థలంలో నీరు నిలుస్తున్నాయని ఏడాది కింద కంప్లైంట్ చేస్తే ట్విట్టర్​లో రెస్పాన్స్​ ఇచ్చారే కానీ చర్యలు తీసుకోలేదంటూ ఫిర్యాదు చేశాడు.

ఖమ్మం, వెలుగు: 
ఖమ్మం నగరంతో పాటు పట్టణాల్లో ఇండ్ల మధ్య ఉన్న ఖాళీ ప్లాట్లు దోమలు, పాములకు నిలయాలుగా మారుతున్నాయి. అమ్మకాలు, కొనుగోళ్లతో ఒకరి నుంచి ఒకరికి ప్లాట్లు చేతులు మారుతున్నా, కొందరు వాటిలో ఇండ్లు కట్టుకోకపోవడం, చుట్టూ ఉన్న వాళ్లు రోడ్డు లెవల్ కంటే ఎక్కువగా మట్టి పోసుకొని ఇండ్లు కట్టుకోవడం వల్ల ఆ ప్లాట్లు లోతట్టు ప్రాంతాలుగా మారుతున్నాయి. వాటి నుంచి నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో నిలిచి చిన్నపాటి కుంటలుగా కనిపిస్తున్నాయి. మరికొన్నింటిలో పిచ్చి, కంప చెట్లు మొలవడంతో దోమలు, పాములకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులపై ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. వందల సంఖ్యలో ఖాళీ ప్లాట్లు ఉండడం, వాటి నుంచి నీళ్లు బయటకు పంపించాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. 

పట్టణ ప్రగతిలో విస్తృత ప్రచారం
పట్టణ ప్రగతి సమయంలో ఖాళీ ప్లాట్లను వాటి యజమానులే బాగు చేసుకోవాలని మైక్​ల ద్వారా ప్రచారం చేశారు. అలా చేసుకోకుంటే తాము ఆ ప్లాట్లను బాగుచేసేందుకు అయిన ఖర్చుకు రెట్టింపు మొత్తాన్ని ప్లాట్ల యజమానుల నుంచి జరిమానా రూపంలో వసూలు చేస్తామంటూ వార్నింగ్  ఇచ్చారు. అయినా చాలా మంది ప్లాట్ల యజమానులు స్పందించలేదు. దీంతో డివిజన్ల వారీగా గుర్తించిన ఖాళీ ప్లాట్లలో అధికారులు కంప చెట్లను జేసీబీల ద్వారా తొలగించడం, కొన్ని ప్లాట్లలో బిల్డింగ్ మెటీరియల్ ను నింపి లెవలింగ్​ చేశారు. ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు ఓనర్ల సమాచారం లేకపోవడం ఇబ్బందిగా మారింది. నోటీసులను ఎవరికి, ఎక్కడికి పంపించాలో తెలియక వేలల్లో ఖాళీ ప్లాట్లున్నా, పదుల సంఖ్యలో నోటీసులు ఇచ్చి సరిపెట్టారు. కొంత మందికి నోటీసులు ఇచ్చినా వారి నుంచి రెస్పాన్స్​ ఉండడం లేదని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. 

260కి పైగా డెంగీ కేసులు..
రాష్ట్రంలో ఈ సీజన్​లో అత్యధిక డెంగీ, విష జ్వరాలు నమోదైన జిల్లాల్లో ఖమ్మం జిల్లా గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని జిల్లాలతో పోటీ పడుతోంది. గతనెలలో 260కు పైగా డెంగీ కేసులు నమోదు కాగా, ఈ నెలలో కూడా దాదాపు అదే సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక వేలాది మంది మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. వీటన్నింటికి దోమల వ్యాప్తే ప్రధాన కారణం. మరోవైపు దోమలను నివారించేందుకు చేయాల్సిన ఫాగింగ్ విషయంలోనూ పలు ఆరోపణలు వస్తున్నాయి. ఫాగింగ్ చేయకుండానే చేసినట్టుగా రికార్డుల్లో చూపిస్తున్నారని అంటున్నారు. ఆఫీసర్లు, మున్సిపల్ పాలకవర్గం సభ్యులు మాత్రం వర్షం కురిసిన రోజు తప్పించి మిగిలిన రోజుల్లో ఫాగింగ్ చేస్తున్నామని అంటున్నారు. ఖాళీ ప్లాట్లలో నీళ్లు నిలవకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.