కరువుదీరా వానలతో కదిలిన ఏరువాక!

కరువుదీరా వానలతో కదిలిన ఏరువాక!
  • పల్లెల్లో ముమ్మరంగా వ్యవసాయ పనులు
  • వర్షం గ్యాప్​ ఇవ్వడంతో జోరుగా వరి నాట్లు 

నిజామాబాద్, వెలుగు: ఆరు రోజుల నుంచి రికాం లేకుండా కురిసిన వర్షం గెరివివ్వడంతో పల్లెల్లో వ్యవసాయ పనుల జోరందుకున్నాయి. పది రోజుల కిందటి వరకు వర్షాలు లేక ఖరీఫ్ సీజన్​పై నిరాశతో ఉన్న రైతులు, ఇటీవల కురిసిన వానలకు హుషారయ్యారు. దున్నిపెట్టిన భూముల్లో నాట్లు వేసుకుంటున్నారు.  దీంతో గ్రామాల్లో వ్యవసాయ సందడి నెలకొంది. జిల్లాలో 5.13 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది.

అందులో 4.17 లక్షల ఎకరాల్లో వరి సాగు కావొచ్చని అగ్రికల్చర్ ఆఫీసర్ల అంచనా. వర్షాలకు ముందు బోరునీటి ఆధారంగా సుమారు 2.25 లక్షల ఎకరాల్లో  నాట్లేశారు. అదనంగా మరో 25 వేల ఎకరాల్లో మాత్రమే నాటు పడుతోందని అధికారులు భావించారు. కానీ ఇటీవల వర్షాలు దంచికొట్టడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.నిజాంసాగర్, ఎస్పారెస్పీ ప్రాజెక్టుల్లోకి నీరు రావడం, చెరువులు జలకళతో నిండడంతో ధైర్యంగా నాట్లేస్తున్నారు.