బీజేపీ కొత్త మిత్రుడు?

బీజేపీ కొత్త మిత్రుడు?

మహారాష్ట్రలో చాలా పొలిటికల్​ మార్పులు రాబోతున్నాయా? ముఖ్యమంత్రి ఉద్ధవ్​ థాక్రే చిన్నాన్న కొడుకు రాజ్​ థాక్రేని బీజేపీ ఎంకరేజ్​ చేయబోతోందా? ప్రస్తుతం కాంగ్రెస్​, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకుని శివసేన పవర్​లోకి రావడంపై ఆ పార్టీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని బీజేపీ క్యాష్​ చేసుకోవాలనుకుంటోందా? ఎంఎన్​ఎస్​ పార్టీ జెండాని రాజ్​ పూర్తిగా మార్చేసి, కొత్త రూపం ఇవ్వడం వెనక కారణం ఇదేనా? ఈ సంకేతాలన్నీ త్వరలో జరిగే మార్పులకు ముందస్తు సన్నాహాలే అంటున్నారు ఎనలిస్టులు. అయితే ఇప్పటికిప్పుడు ఎంఎన్​ఎస్​ వల్ల బీజేపీకి ఒరిగేదేమిటనే చర్చకూడా బలంగా వినిపిస్తోంది.

నిప్పు లేనిదే పొగ రాదన్న నానుడి రాజకీయాల్లో నూరు శాతం సరిపోతుంది. ఈ నెల రెండోవారంలో మహారాష్ట్ర నవనిర్మాణ్​ సేన (ఎంఎన్​ఎస్​) చీఫ్​ రాజ్​ థాక్రేతో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్​ భేటీ కావడం కూడా అలాంటిదే. కేవలం ఫ్రెండ్లీగానే కలిశామని ఫడ్నవీస్​ అన్నప్పటికీ, బిట్వీన్​ ది లైన్స్​ ఏమై ఉంటుందా అని కూపీ లాగారు ఎనలిస్టులు. తాజాగా తన పెదనాన్న బాల్​ థాక్రే 94వ జయంతి వేడుకల సందర్భంలో రాజ్​ తన రాజకీయ ఎత్తుగడల్ని బయటపెట్టారు. ముంబై శివారులోని గోరేగావ్​లో జరిగిన సభలో.. శివసేన ఫౌండర్​ బాలా సాహెబ్​ నమ్మిన మరాఠా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. అంతకు ముందు జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్​ మీటింగ్​లో తమ పార్టీకి కొత్త జెండాని విడుదల చేశారు. కాషాయ జెండాలో శివాజీ మహారాజ్​ ‘రాజముద్ర’ని చేర్చారు. పార్టీని పూర్తిగా కాషాయీకరణ చేయడమేకాక, కేంద్ర ప్రభుత్వ సిటిజెన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​ (సీఏఏ), నేషనల్​ రిజిస్టర్​ ఆఫ్​ సిటిజన్స్​(ఎన్నార్సీ)లకు మద్దతు ప్రకటించారు. ఇల్లీగల్​ మైగ్రెంట్లను తరిమికొట్టాలన్న డిమాండ్​తో వచ్చే నెల 9న ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఇది చెప్పుకోదగ్గ పరిణామంగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఢిల్లీ ఎన్నికలు ముగిశాక యాక్షన్​ ప్లాన్​

ఢిల్లీలో ఎన్నికలు ముగిశాక మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు ఖాయమయ్యేలా ఉన్నాయి. బాల్​ థాక్రే హయాం నుంచీ చెట్టపట్టాలు వేసుకున్న శివసేన, బీజేపీ విడిపోయాక, ఎనలిస్టులు చాలా కోణాల్లో రోజువారీ పాలిటిక్స్​ని గమనిస్తున్నారు. శివసేన తన శత్రువులైన కాంగ్రెస్​, ఎన్సీపీలతో కలిసి​ గవర్నమెంట్​ ఏర్పాటు చేసుకుంది. ముప్పయ్యేళ్లుగా బీజేపీతో ఉన్న స్నేహాన్ని శివసేన చీఫ్​ ఉద్ధవ్​ థాక్రే తన కొడుకు ఆదిత్య కోసం వదిలేసుకున్నారు. గతంలో 2014లోనూ బీజేపీని కాదనుకుని వెళ్లిపోయినా ఆ తర్వాత మళ్లీ కలిశారు. కానీ, ఇప్పుడు కేవలం పవర్​ కోసమే బీజేపీకి దూరమయ్యారన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో ఉన్నట్లుగా ఎనలిస్టులు చెబుతున్నారు. అందుకే రాజ్​ థాక్రేని తమతో కలుపుకోవాలన్న నిర్ణయానికి వచ్చిందంటున్నారు.

ఇప్పటికిప్పుడు ఎంఎన్​ఎస్​ వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే, మహారాష్ట్ర రాజకీయాల్లో దూకుడుగా ఎంట్రీ ఇచ్చిన ఎంఎన్​ఎస్​ కొంతకాలంగా చాలా వెనుకబడిపోయింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లు గెలుచుకుని నాలుగో పెద్ద పార్టీ అయింది. మరో 24 స్ఠానాల్లో రెండో ప్లేస్​లో నిలబడింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్​–ఎన్సీపీ కూటమి 144 సీట్లతో అధికారంలోకి రాగా, శివసేన–బీజేపీ కూటమి 90 సీట్లు తెచ్చుకుని ప్రతిపక్షంలో కూర్చున్నాయి. ఎంఎన్​ఎస్​కి చాలా భవిష్యత్తు ఉందని అందరూ అనుకున్నారు. ముంబై నగరంలో ఆరు సీట్లు, నాసిక్​లో 3, థానే జిల్లాలో రెండు, ఫుణే, ఔరంగాబాద్​ల్లో ఒక్కొక్కటి ఎన్​ఎంఎస్​ ఖాతాలో పడ్డాయి. 2012 నాటికి 16 కార్పొరేషన్లకు గాను బృహన్​ ముంబై, నాసిక్​, కల్యాణ్​–దోంబీవాలీ, పుణే, జల్​గావ్​ మునిసిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో మంచి సత్తా చూపించింది.

ఐదేళ్లుగా తగ్గుతున్న పాపులారిటీ

అలాంటి పార్టీ 2014 ఎన్నికల్లో ఒక్క  స్థానానికే పరిమితమయ్యింది. జున్నార్​ స్థానంలో శరద్​ దాదా సోనావానే ఎంఎన్ఎస్​ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేసి, పోస్ట్​ అలయెన్స్​తో పవర్​లోకి వచ్చాయి. ఎంఎన్​ఎస్​ పూర్తిగా నష్టపోయింది. 218 సీట్లలో కేండిడేట్లను నిలబెడితే, 203 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఇక, 2017లో జరిగిన మునిసిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లోనూ చావు దెబ్బ తింది. కల్యాణ్​–దోంబీవాలీ కార్పొరేషన్​లో మాత్రమే డబుల్​ డిజిట్​ కార్పొరేటర్లను గెలిపించుకోగలిగింది. నాసిక్​ కార్పొరేషన్​లో బలం 40 నుంచి 5 సీట్లకు పడిపోయింది. 10 కార్పొరేషన్లలో అసలు పోటీయే చేయలేని పరిస్థితిని ఎదుర్కొంది.  బృహన్​ ముంబై కార్పొరేషన్​లో ఏడుగురు గెలవగా, వాళ్లలో ఆరుగురు శివసేనలో చేరిపోవడంతో, ప్రస్తుతం ఒక్కరే కార్పొరేటర్​ మిగిలారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఎన్​ఎస్​ది అదే పరిస్థితి. కేవలం ఒకే ఒక్క సీటు (కల్యాణ్​ రూరల్​లో రమేశ్​ రతన్​ పాటిల్) గెలుచుకుంది. ఆర్థికంగా బలం లేకపోవడం, దూకుడుగా పార్టీ కార్యకర్తలు ప్రవర్తించడం వంటివి ఎంఎన్​ఎస్​ని బాగా దెబ్బతీశాయంటారు ఎనలిస్టులు. ఓటు షేర్​ 2.25 శాతానికి పడిపోయింది. అలాగని ఎంఎన్​ఎస్​ని తీసిపారేయలేరు. ముంబై, నాసిక్​, మరఠ్వాడా ప్రాంతాల్లో ఎంఎన్​ఎస్​ రెండో స్థానంలో నిలిచింది. మాహిం, సేవ్రీ, భందుప్​ వెస్ట్​, ములుంద్​ వంటి చోట్ల బీజేపీ–శివసేన కూటమికి గట్టి పోటీ ఇవ్వగలిగింది. కాబట్టి, రాజ్​ థాక్రే గనుక తమవైపు ఉన్నట్లయితే, అసంతృప్తితో ఉన్న శివసైనికులను తిప్పుకోవడానికి అవకాశముంటుందని బీజేపీ అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. ఉద్ధవ్​ థాక్రే తన కొడుకు కోసమే పార్టీ సిద్ధాంతాల్ని, ఆశయాల్ని వదులుకుని కాంగ్రెస్​–ఎన్సీపీలతో చేతులు కలిపారన్న ఫీలింగ్​ చాలామంది శివసేన కార్యకర్తల్లో ఉందంటున్నారు. ఉద్ధవ్​ థాక్రే ప్రవర్తన కూడా ఆయన సన్నిహితులకు చికాకు పుట్టిస్తోందని ఎనలిస్టుల అంచనా. తన మిత్రులెవరో, శత్రువులెవరో కూడా గుర్తించలేకపోతున్నారని, అక్టోబరులో అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాక ఇతరులెవ్వరినీ నమ్మకుండా సంజయ్​ రౌత్​ ఒక్కరితోనే మంతనాలు సాగించడాన్ని కొందరు ఓపెన్​గానే విమర్శిస్తున్నారు. తన పొలిటికల్​ అడ్వయిజర్​గా కాకుండా శ్రేయోభిలాషిగా సంజయ్​ని భావిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికైతే ఉద్ధవ్​ ఎమ్మెల్యే కాదు. రూల్స్​ ప్రకారం మే నెలలోగా ఆయన ఏదో ఒక చోట నుంచి అసెంబ్లీకి గెలవడమో, లేదా కౌన్సిల్​ మెంబర్​ కావడమో తప్పదు.

బాలాసాహెబ్​ వారసుడిగా…

రాజ్​ థాక్రే విషయంలో అలాంటి అసంతృప్తులేవీ లేవని, ఆయన ఏ విషయంలోనైనా పెదనాన్న బాల్​ థాక్రేలా సొంతంగా ఆలోచిస్తారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.  అందుకే ‘బాలాసాహెబ్​కి నిజమైన వారసుడు రాజ్​ థాక్రేనే’ అనే మెసేజ్​ వాళ్లకు ఇవ్వాలన్నది బీజేపీ స్ట్రేటజీగా ఊహిస్తున్నారు. రాబోయే లోకల్​ బాడీ ఎన్నికల్లో బీజేపీ–ఎంఎన్​ఎస్​ కలిసి పనిచేయడానికి ఇప్పటికే రంగం సిద్ధమైందని, శివసేన ఓటు బ్యాంక్​ని లాక్కోవడానికి తగిన నాయకుడు రాజ్​ థాక్రే ఒక్కరేనని చెబుతున్నారు. అదీగాక, ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి సౌత్​కి వెళ్లేసరికి బీజేపీ కూటమిలో ఎవరూ లేరు. ఈ కోణంలో చూసినా బీజేపీ తన బేస్​ని బలంగా మార్చుకోవాలంటే రాజ్​ థాక్రేతో చేయి కలపక తప్పదంటున్నారు ఎనలిస్టులు.

గతంలో రాజ్​ థాక్రే పార్టీ జెండాలో కాషాయం, నీలం, తెలుపు, గ్రీన్​ రంగులుండేవి. నీలం ద్వారా దళితులను, కాషాయం ద్వారా హిందువులను, గ్రీన్​ కలర్​ ముస్లింలను సూచించేలా జెండా ఉండేది. మూడు  నెలల క్రితం శివసేన.. తన ప్రధాన శత్రువులైన కాంగ్రెస్​, ఎన్సీపీలతో చేతులు కలిపి అధికారం దక్కించుకుంది. శివసేన చీఫ్​ ఉద్ధవ్​ థాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. దీనినే ఎంఎన్​ఎస్​ తన కొత్త ఎజెండాకి అనుకూలంగా మార్చుకుంది. ఈ మూడు నెలల నుంచి సాగిస్తున్న చర్చల ఫలితంగానే.. రాజ్​ థాక్రే ఇల్లీగల్​ మైగ్రెంట్లను తరిమికొట్టాలన్న డిమాండ్​తో ర్యాలీకి రెడీ అవుతున్నారు. శివసేన పవర్​ కోసం పార్టీ సిద్ధాంతాల్ని పక్కనపెట్టేసిందనే ప్రచారం బాగా సాగుతోంది. హిందూత్వ కార్డును శివసేన వదిలేసిందని, ఆ లోటును ఎంఎన్​ఎస్​ భర్తీ చేస్తుందని అంటున్నారు. పార్టీ మీటింగ్​లో ‘నేను మరాఠీని, హిందువును. నేను పవర్ ​కోసం నా పార్టీ రంగును మార్చుకోను’ అని ప్రకటించడం ఇందులో భాగమే!

దూకుడే రాజ్​ బలం

శివసేన రాజకీయాల్లో ఉద్ధవ్​ థాక్రే ఒక మలుపు. ఆయన ప్రవేశించేవరకు శివసేనలో బాల్​ థాక్రే తమ్ముడి కొడుకు రాజ్ థాక్రే హవా నడిచేది. పెద్ద నాన్నకి చేదోడువాదోడుగా ఉండేవారు. బాల్​ థాక్రే మాదిరిగానే రాజ్​ కూడా పొలిటికల్​ కార్టూనిస్టు, మంచి వక్త. ఆయన మాటతీరు, వ్యవహారశైలి కూడా బాలాసాహెబ్​లా ఉంటుందంటారు. చాలాసార్లు మీనా తాయ్​ (బాల్​ థాక్రే భార్య) పార్టీ ఆఫీసుకి ఫోన్​ చేస్తే రాజ్​ రిసీవ్​ చేసుకునేవారట. ఆమె తన భర్తే మాట్లాడుతున్నారనుకుని పొరబడేవారట. ఉద్ధవ్​ థాక్రే పార్టీలో ప్రవేశించాక ఎన్నికల సీట్ల కేటాయింపులో రాజ్​ మాటని పట్టించుకోలేదు. దాంతో ఆయన బాలాసాహెబ్​ బతికుండగానే బయటకు వచ్చేసి మహారాష్ట్ర నవనిర్మాణ్​ సేన ఏర్పాటు చేసుకున్నారు.

రాజ్​ థాక్రే చాలా విషయాల్లో కార్యకర్తల్ని ఊసిగొల్పిన సందర్భాలున్నాయి.

మరాఠీ భాషలోనే సైన్​ బోర్డులుండాలని షాపు ఓనర్లపై ఒత్తిడి తేవడం

మునిసిపాలిటీల్లో సరిగ్గా పనులు చేయని కాంట్రాక్టర్లపై చేయి చేసుకోవడం

ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్న మల్టీఫ్లెక్స్​ థియేటర్లపై దాడి చేయడం

మహారాష్ట్రలోని టోల్​ గేట్లపై  దాడి చేయడం, 2 కోట్ల రూపాయల లోపు ఖర్చుతో రోడ్లు వేసిన చోట్ల టోల్​ గేట్లు మూయించడం.

గుజరాతీల షాపులపై దాడి చేసి, మరాఠీలో బోర్డులుండేలా డిమాండ్​ చేయడం

రాజ్​ థాక్రే వేసిన కార్టూన్​ని విమర్శిస్తూ ఫేస్​బుక్​లో పోస్టు పెట్టినందుకు ఒకరిని చితక్కొట్టడం. ఇలాంటి పనులన్నీ ఎంఎన్​ఎస్​ కార్యకర్తలు తరచు చేస్తుంటారు. అయితే, ఇవన్నీ మరాఠాల ఆత్మగౌరవాన్ని కాపాడ్డానికే చేస్తు న్నామని రాజ్​ సమర్థించుకుంటారు.

కొడుకు అమిత్​కి ప్రోత్సాహం

థాక్రే ఫ్యామిలీ నుంచి చట్టసభల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్నది రాజ్​ థాక్రే ఆలోచన. ఆయన పెట్టిన ఎంఎన్​ఎస్​ తరఫున శాలిని థాక్రే పోయినేడాది లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజ్​ కజిన్​ జితేంద్ర వినాయక్​ థాక్రే భార్య శాలిని. ఆమె ముంబై నార్త్​ వెస్ట్​ నియోజకవర్గంలో నిలబడి మూడో స్థానం దక్కించుకున్నారు. బాల్​ థాక్రే మాత్రం ఎప్పుడూ శివసేన నుంచి తన ఫ్యామిలీ మెంబర్లకు టిక్కెట్లివ్వలేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఉద్ధవ్​ థాక్రే తన కొడుకు ఆదిత్యను వర్లి స్థానంలో నిలబెట్టి గెలిపించారు. ఉద్ధవ్​ థాక్రే ఇప్పటికీ ఎమ్మెల్యే కాదు.  ఇదలా ఉంచితే, రాజ్​ థాక్రే తన కొడుకు అమిత్​ థాక్రేని పార్టీలోకి తెచ్చారు. ఎంఎన్​ఎస్​ ఎగ్జిక్యూటివ్​ మీటింగ్​లో తన వారసుడిని కార్యకర్తలకు పరిచయం చేశారు.