రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో భారీగా చేరికలు 

రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో భారీగా చేరికలు 

నల్గొండ : కేసీఆర్ అహంకారాన్ని దెబ్బ కొట్టాలంటే మునుగోడులో బీజేపీ గెలవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ఒక వ్యక్తి కోసం వచ్చింది కాదని, ప్రజల కోసం వచ్చిన ఎన్నిక అని అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా మునుగోడు వైపు చూస్తోందని, అందుకే ఇక్కడి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చి కేసీఆర్ అహంకారాన్ని దెబ్బకొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు జరిగేది ధర్మ యుద్ధమని ప్రజలంతా కలిసి వచ్చి ధర్మాన్ని గెలిపించాలని కోరారు. తాను పార్టీ మారితే అమ్ముడుపోయానని అప్రతిష్టపాలు చేస్తున్నారని, తన రాజీనామా దెబ్బకు కేసీఆర్ మునుగోడుకు వచ్చిండని అన్నారు. కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా అన్నట్లు ప్రస్తుతం పరిస్థితి తయారైందని వాపోయారు.

 

ఏండ్లకేండ్లు ఉద్యమం చేసినా మండలం ఇవ్వని కేసీఆర్.. తాను అమిత్ షాను కలిసిన రోజే కొత్త మండలం ప్రకటించిన విషయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. 2014 ముందు కేసీఆర్ ఆస్తి ఎంత ఇప్పుడు ఎంత ఉందని ప్రశ్నించారు. సిరిసిల్లకు ఎక్కువ నిధులిచ్చి మునుగోడుకు మాత్రం తక్కువ నిధులు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం కేసీఆర్ వెంట ఉన్న ఎర్రబెల్లి, గంగుల, పువ్వాడ ఉద్యమంలో పాల్గొన్నరా అని నిలదీశారు. 

లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే నీళ్లలో మునిగిపోయిందని రాజగోపాల్ విమర్శించారు. కేజీ టూ పీజీ విద్య హామీ ఏమైందని ప్రశ్నించారు. కులమతాలకు అతీతంగా పేదలు, బడుగు బలహీన వర్గాలు ఏకమై చరిత్ర తిరగరాయాలని రాజగోపాల్ పిలుపునిచ్చారు. బతికినన్ని రోజులు ప్రజా జీవితంలో ఉండి సేవ చేసుకుంటానని చెప్పారు.

అంతకు ముందు గట్టుప్పల్ మండలం కమ్మగూడెం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్తో పాటు మరికొందరు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరికీ ఆయన కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.