రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రెండు పంచాయతీల్లో ఆసక్తికర పోరు నెలకొంది. ఎల్లారెడ్డిపేట మేజర్ పంచాయతీ ఎస్సీ జనరల్ కు రిజర్ అయింది. దీంతో అన్నదమ్ములు కొర్రి రమేశ్, కొర్రి ప్రమోద్ పోటీ చేస్తూ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు.
వెంకటాపూర్ పంచాయతీ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో అత్తాకోడళ్లు నామినేషన్ దాఖలు చేశారు. అత్త మామిళ్ల నర్సవ్వకు బీఆర్ ఎస్ మద్దతు తెలపగా.. కోడలు మామిళ్ల అంజలి ఇండిపెండెంట్‌గా బరిలో నిలించారు.
ఎల్లారెడ్డి పేట పంచాయతీలో బావ బామ్మర్ది పోటీలో నిలవగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు బలపరిచాయి. ఇదే మండలంలో రక్త సంబంధీకులు, బంధువులు బరిలో ఉండడంతో ఎవరు గెలుస్తారోననే ఆసక్తి నెలకొంది.
జగిత్యాల జిల్లాలో మామ కోడళ్లు
రాయికల్, వెలుగు: జగిత్యాల జిల్లా రాయికల్‌మండలం శ్రీరాంనగర్ పంచాయతీ సర్పంచ్‌స్థానానికి ఒకే ఇంట్లోంచి ఇద్దరు పోటీలో నిలిచారు. వీరులో ఒకరు మామ.. మరొకరు కోడలు. ఇక్కడ సర్పంచ్ స్థానం బీసీ జనరల్‌కు అయింది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మామ తాళ్లపెల్లి సత్యనారాయ ణను కాంగ్రెస్.. కోడలు తాళ్లపెల్లి రాధికను బీజేపీ బలపరిచాయి. వీరితోపాటు మరో ఇద్దరు చొప్పరి పోచమల్లు, దండవేని రమ పోటీలో ఉన్నారు.
సర్పంచ్, ఉప సర్పంచ్ లుగా భార్యాభర్తలు.. అత్తా కోడళ్లు!
అయిజ: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో ఒకే ఇంట్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు దక్కాయి. ఈ పదవులు భార్యాభర్తలు, అత్త కోడలికి దక్కాయి. గుడిదొడ్డి సర్పంచ్ గా కోడలు వరలక్ష్మి, ఉపసర్పంచ్ గా అత్త ఈశ్వరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కురువపల్లి సర్పంచ్ గా మంజుల, ఉప సర్పంచ్ గా ఆమె భర్త బజారి, వెంకటాపురం సర్పంచ్ గా శకుంతలమ్మ, ఉపసర్పంచ్ గా ఆమె భర్త చిన్న భీముడు ఎన్నికయ్యారు.
