ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న బస్సు.. 18 మంది మృతి.. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణం

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న బస్సు.. 18 మంది మృతి.. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణం
  • మరో ఆరుగురికి తీవ్రగాయాలు.. రాజస్తాన్లో ఘోర ప్రమాదం
  • డ్రైవర్​ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణం

జైపూర్: రాజస్తాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రైలర్ ట్రక్కును ఓ బస్సు ఢీకొట్టడంతో 18 మంది చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని జైపూర్ కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్హోడి జిల్లా మటోడా గ్రామం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బాధితులను జోధ్  పూర్ లోని సుర్ సాగర్  ఏరియాకు చెందినవారుగా గుర్తించారు. 

వారు బికనీర్ లోని కోల్యాయత్  టెంపుల్ కు వెళ్లారు. అక్కడ కపిలముని ఆశ్రమంలో పూజలు చేసి మొక్కులు సమర్పించారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న బస్సు భారత్ మాల హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

బస్సులో ఇరుక్కున్న మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా.. యాత్రికులు ఉన్న బస్సు చాలా వేగంగా వెళుతోందని, దీంతో రోడ్డు పక్కన ఆగిఉన్న ట్రైలర్  ట్రక్కును బస్ డ్రైవర్ గుర్తించలేకపోయాడని పోలీసులు తెలిపారు. 

కాగా, ఈ ప్రమాదంపై రాజస్తాన్ సీఎం భజన్ లాల్ శర్మ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ప్రమాద వార్త విని షాక్ కు గురయ్యానని ‘ఎక్స్’ లో తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్  చేశారు. బాధితులకు మెరుగైన సాయం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించానని వెల్లడించారు.