
రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘వేట్టయాన్ – ద హంటర్’. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. బుధవారం ప్రివ్యూ పేరుతో ట్రైలర్ తరహా వీడియోను విడుదల చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ట్రైనింగ్ మీటింగ్‌లో పేరు మోసిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌లు అంటూ నలుగురు పోలీసుల ఫొటోలను (సత్యదేవ్) అమితాబ్ బచ్చన్ చూపించడంతో వీడియో మొదలైంది. ఆ నలుగురిలో ‘వేట్టయాన్’ (రజినీకాంత్) కూడా ఉన్నాడు. రౌడీలను వేటాడే హంటర్‌గా రజినీకాంత్ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది.
‘మనకు ఎస్.పి అనే పేరు మీద ఒక యముడొచ్చి దిగాడు’ అంటూ ఆయన పేరు వింటేనే క్రిమినల్స్ భయపడుతుంటారు. ‘ఎన్‌కౌంటర్ పేరుతో ఒక మనిషిని హత్య చేయడం ఒక హీరోయిజమా’ అంటూ అమితాబ్ ప్రశ్నించడం.. ‘ఎన్‌కౌంటర్ అనేది నేరం చేసిన వాళ్లకు విధించిన శిక్ష మాత్రమే కాదు.. ఇక మీదట ఇలాంటి నేరం మళ్లీ జరగకూడదు అని తీసుకునే ముందు జాగ్రత్త చర్య’ అని రజినీకాంత్ బదులివ్వడం ఆసక్తికరంగా ఉంది. విలన్‌గా రానా, ఇతర పాత్రల్లో ఫహద్ ఫాజిల్, దుసారా విజయన్, మంజు వారియర్, అభిరామి, రావు రమేష్, కిషోర్, రితిక సింగ్, రోహిణి కనిపించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న సినిమా విడుదల కానుంది.