
- ఎస్ఎఫ్టీ రూ.1150 చొప్పున రేటు నిర్ణయం
- రూ.87.41 కోట్లుగా మొత్తం ప్రాజెక్టు ధర
- కొనుక్కునేందుకు ప్రభుత్వాధికారుల ప్లాన్
ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరాన్ని ఆనుకొని పోలేపల్లిలో ఉన్న రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్లు అమ్మేందుకు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 8 టవర్స్ లో ఉన్న మొత్తం 576 ఫ్లాట్లను ఒకే యూనిట్ గా అమ్మేందుకు తాజాగా నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. అసంపూర్తిగా ఉన్న ఈ నిర్మాణాలను ఉన్నది ఉన్నట్టుగానే అమ్మాలని నిర్ణయించింది. ఎస్ఎఫ్టీ ధరను ప్రభుత్వం రూ.1150గా, మొత్తం ప్రాజెక్టు ధర రూ.87.41 కోట్లుగా డిసైడ్ చేశారు. వ్యక్తులు, సంఘాలు, బిల్డర్లు, డెవలపర్లు, జాయింట్ వెంచర్లుగా కలిసి మొత్తం 8 టవర్లను ఒకేసారి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఆసక్తి ఉన్న వాళ్లు ఈ ఏడాది సెప్టెంబర్6వ తేదీలోగా రూ. 5 కోట్లు డీడీ తీసి, డీడీని హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో ఉన్న తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువగా సంస్థలు, సంఘాలు ఆసక్తి చూపిస్తే లాటరీ ద్వారా విజేతలను ఎంపిక చేయనున్నారు. సెప్టెంబర్ 8న జలజ టౌన్ షిప్ లోనే లాటరీ తీయనున్నారు. ఇప్పటికే తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్లు ఈ టవర్లను దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.
గతంలో చేసిన ప్రయత్నాలు విఫలం..!
ఉమ్మడి రాష్ట్రంలో 2007లో జలజ టౌన్ షిప్ గేటెడ్ కమ్యూనిటీగా 9.22 ఎకరాల్లో 9 అంతస్తులతో 8 టవర్లు నిర్మించారు. ఎ బ్లాక్ లో నాలుగు టవర్లు ఉండగా ఇందులో 1452, 1569 స్క్వేర్ ఫీట్ల సైజులో 288 త్రిబుల్ బెడ్రూమ్ ప్లాట్లున్నాయి. బీ బ్లాక్‌లోని నాలుగు టవర్లలో 1127, 1251 స్క్వేర్ ఫీట్ల సైజులో 288 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మించారు. పోలేపల్లిలో మున్నేరు నదికి సమీపంలో రూ.60 కోట్లతో ఈ టవర్ల నిర్మాణాలు చేపట్టగా, ఆ తర్వాత పలు కారణాలతో అసంపూర్తిగానే నిర్మాణాలు ఆగిపోయాయి. కరెంటు, నీటి పైప్ లైన్లు సహా పెండింగ్ ఇంటీరియర్పనులన్నీ కొనుక్కున్న వాళ్లే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. 2020లో వేలం ద్వారా బీఆర్ఎస్ హయాంలో అమ్మేందుకు ప్రయత్నాలు చేసినా, కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి.
2022 మార్చి 24న ఆన్ లైన్‌లో టవర్ల వారీగా అమ్మేందుకు వేలం నిర్వహించగా, కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అమ్మకానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో రూ.2500కు పైగా స్క్వేర్ ఫీట్ చొప్పున ధరను నిర్ణయించగా, ఈ రేటును ఇప్పుడు రూ.1150 చొప్పున డిసైడ్ చేశారు. కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్న వారి కోసం ఆగస్టు 11న జలజ టౌన్‌షిప్‌లోనే అధికారులు ప్రీ బిడ్ సమావేశం ఏర్పాటు చేశారు.
దక్కించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగుల ప్లాన్..!
ఈ అపార్ట్ మెంట్లను గతంలో ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన సమయంలో టవర్ల వారీగా అమ్మాలని కొందరు, అపార్ట్ మెంట్ ఒక యూనిట్ గా అమ్మితే సామాన్యులకు కొనుక్కునేందుకు వీలు కలుగుతుందని మరికొందరు అధికారులకు విన్నవించారు. అయితే ఒకసారి టవర్ల వారీగా అమ్మకానికి పెట్టినా కూడా రేటు ఎక్కువగా నిర్ణయించడంతో కొనుగోలుదారులు ముందుకు రాలేదు. అయితే తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మొత్తం టవర్లను కొనుక్కునేందుకు ప్లాన్ చేస్తున్నారు. గడువులోగా రూ.5 కోట్ల మొత్తాన్ని డీడీ తీసేందుకు ఇప్పటికే ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. గత నెలలోనే ఇందుకు సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో ఇప్పటికే మాట్లాడామని చెబుతున్నారు. అధికారికంగా ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే తాము కొనుక్కుంటున్నామని, ఆ తర్వాత వాటన్నింటినీ బాగుచేసుకొని అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీలాగా తీర్చిదిద్దుతామంటున్నారు. అపార్ట్ మెంట్ల కొనుగోలు తర్వాత ఉద్యోగుల కోసం రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ, సోలార్ ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్, పార్క్, కమ్యూనిటీ హాల్, సూపర్ మార్కెట్, క్లబ్ హౌజ్ సహా అన్ని అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని టీజీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు చెప్పారు.