- అధికారంలోకి వచ్చేది ఎన్డీయే కూటమే: రాజ్నాథ్ సింగ్
- కాంగ్రెస్, ఆర్జేడీ వారసత్వ రాజకీయ వలయంలో చిక్కుకున్నయని విమర్శ
- పాట్నాలో ఎన్నికల ప్రచారంలో రక్షణ శాఖ మంత్రి కామెంట్లు
పాట్నా/దర్బంగా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లు ఎన్డీయే కూటమికే వస్తాయని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ దీమా వ్యక్తం చేశారు. 243 సభ్యులున్న అసెంబ్లీలో.. బంపర్ మెజార్టీతో అధికారంలోకి వస్తున్నామని తెలిపారు. నవంబర్ 14వ తేదీన వచ్చే ఫలితాలు.. పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఇచ్చే అసలైన నివాళులని చెప్పారు. నెహ్రూ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు.
పాట్నాలోని బర్హ్, దర్బంగాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాజ్నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మళ్లీ గూండారాజ్ రావాలని బిహార్ ప్రజలు కోరుకోవడం లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కిడ్నాప్‌లు, దోపిడీలు సర్వసాధారణమయ్యాయి. నేటి తరం యువతకు ఆ చీకటి రోజులు గుర్తులేకపోయినా, బిహార్ భవిష్యత్తు కోసం ఆ పాలన తిరిగి రాకుండా ఓటర్లు జాగ్రత్త వహించాలి.
కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు రెండూ వారసత్వ రాజకీయాల వలయంలో చిక్కుకున్నాయి. బిహార్ సీఎం గా నితీశ్ కుమార్ బాధ్యతలు చేపట్టాక వ్యవస్థలను గాడినపెట్టారు’’అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రతిపక్ష కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చలేనివి అని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ఒక్కో కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు. గురువారం ఎన్డీయే కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామన్నారు.
ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. 20 ఏండ్లు బిహార్‌కు సీఎంగా ఉన్నప్పటికీ నితీశ్ కుమార్‌పై ఒక్క అవినీతి మరక కూడా పడలేదని చెప్పారు. కానీ.. లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ మొత్తం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నదని విమర్శించారు. నితీశ్ నాయకత్వంలో బిహార్ జీడీపీ 14% ఉందని తెలిపారు. దేశంలో రెండో స్థానంలో బిహార్ ఉన్నదని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
