న్యూఢిల్లీ: ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్ వద్ద పేలుళ్లకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్హెచ్చరించారు. వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై దేశంలోని ప్రముఖ ఇన్వెస్టిగేషన్ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ‘‘ఢిల్లీ బ్లాస్ట్‌పై దేశంలోనే ప్రముఖ సంస్థలు వేగంగా, సమగ్రంగా దర్యాప్తు జరుపుతాయని నేను ప్రజలకు హామీ ఇస్తున్నా.
దర్యాప్తులో వెల్లడైన విషయాలను త్వరలోనే వెల్లడిస్తం. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిని న్యాయస్థానం ముందు నిలబెడ్తం. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోం” అని పేర్కొన్నారు. పేలుళ్ల ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతున్నదని, ఈ నేపథ్యంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
