
జైపూర్: 'రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన' చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు అతి సమీపం నుంచి ఆయనను కాల్చి చంపారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్లో చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు సుఖ్‌దేవ్ సింగ్ ను ఇంటికి వెళ్లి కలిశారు. ఆయనకు ఎదురుగా కుర్చీల్లో కూర్చొని కాసేపు మాట్లాడారు. సుఖ్‌దేవ్ తన ఫోన్ చూస్తున్న సమయంలో హఠాత్తుగా ఆయనపై ఐదుసార్లు కాల్పులు జరిపారు. దీంతో సుఖ్‌దేవ్ అక్కడికక్కడే మృతిచెందారు. సుఖ్‌దేవ్ భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ దుండగుడు కూడా చనిపోయాడు.
భద్రతా సిబ్బందిలోని ఒకరు గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత గజేంద్ర సింగ్ షెకావత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని పోలీసులను కోరారు.
మా శత్రువులకు మద్దతిచ్చినందుకే..
సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు తానే బాధ్యత వహిస్తున్నట్లు కెనడాకు చెందిన గోల్డీ బ్రార్ గ్యాంగ్ మెంబర్ రోహిత్ గోదార కపురిసర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తమ శత్రువులకు మద్దతు ఇచ్చినందుకే ఆయనను హత్య చేసినట్లు పేర్కొన్నారు.