
ముషీరాబాద్, వెలుగు: బీసీ మహిళలకు అన్ని రంగాల్లో ప్రాతినిథ్యం కల్పిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ జి.పద్మ ఆధ్వర్యంలో విద్యానగర్ బీసీ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి బాసటగా నిలుస్తోందని తెలిపారు. పార్లమెంట్లో పాసైన మహిళా బిల్లులో బీసీ మహిళలకు జనాభా ప్రకారం సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఫీజు బకాయిలు ఇవ్వాలి
రాష్ట్రంలోని 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.6 వేల కోట్లను వారం రోజుల్లో చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం సెక్రటేరియట్ వద్ద ఆయన మాట్లాడారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్కారణంగానే గ్రామాల్లో వ్యవసాయ కూలీల పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారని తెలిపారు.
కానీ ఫీజు బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యార్థులు నానాతంటాలు పడుతూ.. కూలీ పనికి వెళ్లే దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలని కోరారు. నాయకులు లాల్ కృష్ణ, నీల వెంకటేశ్, రాజేందర్, రాజ్ కుమార్, మోడీ రాందేవ్, రేకుల మధుసూదన్ రావు, లింగయ్య యాదవ్, నిఖిల్, కౌశిక్ తదితరులున్నారు.