రాజ్యసభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల

భారతదేశ వ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు 2022, మే 24వ తేదీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. దరఖాస్తుల ప్రక్రియ కూడా వెంటనే ప్రారంభించనున్నారు. మే 31వ తేదీ వరకు దరఖాస్తులను అధికారులు స్వీకరించనున్నారు. ఎన్నికల కమిషన్ ఈనెల 12న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర తో పాటు మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసినా.. పరీశీలనలోనే అధికారులు తిరస్కరించారు. అయితే.. వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ సక్రమంగా ఉండడంతో ఆయనకు గెలుపు ధృవీకరణ పత్రం అందచేశారు. ఎమ్మెల్సీగా ఉన్న బండ ప్రకాశ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. బండ ప్రకాశ్ స్థానంలో రవి 2024 ఏప్రిల్ వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. 


తెలుగు రాష్ట్రాలతో సహా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలను భర్తీ కావాల్సి ఉంది. ఎన్నికలు జూన్ 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నాయి. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు. 11 స్థానాలు యూపీలో ఉండగా.. మహారాష్ట్ర, తమిళనాడులో చెరో ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు సీట్లు ఉన్నాయి. ఏపీ నుంచి ఎంపీలు విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరీల పదవీ కాలం ముగియనుంది. తెలంగాణ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్ లు రిటైర్ కానున్నారు. ఇటీవలే అభ్యర్థులను ప్రకటించాయి వైసీపీ, టీఆర్ఎస్ అధిష్టానాలు. విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్. కృష్ణయ్యలకు వైసీపీ అవకాశం కల్పించింది. వీరు త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా దామోదర్ రావు, బండి పార్థసారధి రెడ్డిలను టీఆర్ఎస్ ఖరారు చేసింది. వీరు రేపు నామినేషన్లు దాఖలు చేస్తారని సమాచారం.

మరిన్ని వార్తల కోసం : -