
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శనివారం రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశవ్యాప్తంగా పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాఖీ పండుగను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో హైదరాబాద్ మలక్‌పేటలోని అంధుల ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు పాలుపంచుకున్నారు. రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్రపతికి రాఖీ అందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో రాష్ట్రపతి కాసేపు ఆనందంగా గడిపారు. పిల్లలకు పలు రకాల ఆహార పదర్థాలు, మిఠాయిలు పంచారు. ఏటా విద్యార్థులతో రాష్ట్రపతి రక్షా బంధన్ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి పలువురు విద్యార్థులను పంపాలని గత నెల 31న కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో పలువురు టీచర్లు, విద్యార్థుల పేర్లను రాష్ట్ర సర్కార్ కేంద్రానికి పంపింది.