
అయోధ్య: రాం ఆయేంగే.. ఆయేంగే సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాయని స్వాతి మిశ్రా హృదయాన్ని హత్తుకునే స్వరంతో రాం ఆయేంగే.. ఆయేంగే అంటూ పాడిన భక్తి గీతం ఇంటర్నెట్ లో తుఫాను రేపింది. ఇప్పటికే నాలున్నర కోట్ల మందికి పైగా ఈ భజన సాంగ్ ను వీక్షించి రాముడొస్తున్నడనే తన్మయత్వానికి లోనయ్యారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనున్న తరుణంలో ఈ పాట వైరల్ గా మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ పాటకు ఫిదా అయ్యారు. ‘ శ్రీ రాం లలాకు స్వాగతం పలుకుతూ భక్తి తన్వయత్వంతో స్వాతి మిశ్రా పాడిన పాట మంత్రముగ్ధులను చేస్తుంది’ అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "నేను ఎనిమిది ఏండ్లుగా సంగీతం నేర్చుకుంటున్నాను. ఆన్‌లైన్‌లో పాటలను అప్‌లోడ్ చేస్తున్నాను. ఈ పాట పాడటానికి రాముడు స్వయంగా నన్ను ఎంచుకున్నట్లు అనిపిస్తుంది. ఈ పాట రాముడికే అంకితం చేస్తున్నా" అని స్వాతి మిశ్రా చెబుతున్నారు