అయోధ్య రామ్ లల్లాను ఆయన స్థానానికి చేర్చే సమయం ఆసన్నమైంది : దేవ్ గిరి మహరాజ్

అయోధ్య రామ్ లల్లాను ఆయన స్థానానికి చేర్చే సమయం ఆసన్నమైంది : దేవ్ గిరి మహరాజ్

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామమందిరంలో శ్రీరాముడికి పూజలు చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందూవులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు దాదాపు 70 శాతం పూర్తయ్యాయి. 2024, జనవరి 1వ తేదీ నుంచి భక్తులు పూజల చేసేందుకు రామమందిరం అందుబాటులోకి తీసుకువస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. 

2024 జనవరి మూడో వారంలోపు రాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని.. ఆ రోజు నుంచే భక్తులు దర్శించుకుని.. పూజలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి స్వామిగోవింద్ దేవ్ గిరి మహరాజ్ తెలిపారు. మహారాష్ట్ర థానే జిల్లాలోని డోంబివాలిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. అయోధ్య రామమందిరం నిర్మాణానికి, 2024 సాధారణ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రామ్ లల్లాను అసలు స్థలంలో ప్రతిష్టించే సమయం ఆసన్నమైందని చెప్పారు. విగ్రహాన్ని పూర్వ స్థలంలోకి మార్చిన తర్వాత కూడా నిర్మాణ పనులు కొనసాగుతాయన్నారు. 

2024, జనవరి లోపు గర్భగుడి, మొదటి అంతస్తు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని.. దాంతో పాటు రాముడుని భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు పూర్తి చేయడం తమ ముందున్న లక్ష్యం అని  స్వామిగోవింద్ దేవ్ గిరి మహరాజ్  అన్నారు. భారతదేశం పట్ల ప్రపంచ దృక్పథం ఇప్పుడు మారిపోయిందని పేర్కొన్నారు. యోగా, ఆయుర్వేదం, భారతీయ సంగీతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయన్నారు.