Andhra King Taluka Review: ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ ఫుల్ రివ్యూ.. రామ్-ఉపేంద్ర మూవీ ఎలా ఉందంటే?

Andhra King Taluka Review: ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ ఫుల్ రివ్యూ.. రామ్-ఉపేంద్ర మూవీ ఎలా ఉందంటే?

బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాలు చేసిన రామ్.. ఈసారి ఎమోషనల్‌ కంటెంట్‌ ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘ఇది తన కెరీర్‌‌లోనే మోస్ట్ పర్సనల్‌ సినిమా’ అని ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చాడు హీరో రామ్. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇవాళ గురువారం (2025 నవంబర్ 27న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో రామ్‌కు జంటగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. వరుస పరాజయాల్లో ఉన్న హీరో రామ్‌తో పాటు హీరోయిన్‌గా భాగ్యశ్రీకి.. ఈ సినిమా విజయం ఎంతో అత్యవసరం. మరి రామ్ ఈ సినిమాతో హిట్ అందుకున్నాడా? లేదా? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. 

కథగా... 

సాగర్‌‌ (రామ్) దారి తీరు లేని ఓ లంక గ్రామం నుంచి వచ్చి టౌన్‌లో పాలిటెక్నిక్ చదివే సాదాసీదా కుర్రాడు. కానీ స్టార్ హీరో సూర్య (ఉపేంద్ర)కు వీరాభిమాని. లోకల్‌గా ఫ్యాన్స్‌ ప్రెసిడెంట్. తన ఫేవరేట్‌ హీరోను ఎవరేమన్నా గొడవపడతాడు. షో క్యాన్సిల్ చేశారంటే థియేటర్ అద్దాలు పగలకొడతాడు. అదే థియేటర్‌‌లో టికెట్లు కొని అభిమానులకు పంచిపెడతాడు. పక్కనోళ్లు అది పిచ్చి అంటుంటే తను మాత్రం అభిమానం అంటాడు.

అలాంటి ఓ సాధారణ అభిమాని.. థియేటర్‌‌ ఓనర్‌‌ పురుషోత్తం (మురళీ శర్మ) కూతురు మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే) ఇష్టపడతాడు. ఏ క్రమంలో వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ తన థియేటర్‌‌లో టికెట్ల కోసం పడిగాపులు గాచే ఓ అభిమానికి తన కూతురును ఎలా ఇస్తానంటూ ఎద్దేవ చేస్తాడు పురుషోత్తం. తన ప్రేమను గెలుచుకోవడం కోసం కరెంట్, రోడ్డు సహా కనీస అవసరాలు లేని తన ఊర్లో AC థియేటర్ కట్టి తన అభిమాన హీరో 100వ సినిమాతో ఓపెనింగ్‌ చేస్తానని ఛాలెంజ్ చేస్తాడు సాగర్. అలా తాను విసిరిన ఛాలెంజింగ్ కోసం సాగర్ ఏం చేశాడు అనేది మిగతా కథ.

మరోవైపు మారుమూల గ్రామంలో ఉన్న ఈ అభిమాని కోసం స్టార్ హీరో సూర్య ఎందుకు వెతుక్కుంటూ రావల్సి వచ్చింది. అంతలా ఆ హీరో కోసం సూర్య ఏం చేశాడు అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా. 

ఎలా ఉందంటే..

సహజంగా తమ ఫేవరేట్ స్టార్‌‌ను వెతుక్కుంటూ అభిమానులు వెళ్తుంటారు. కానీ స్టార్ హీరోనే ఎలా ఉంటాడో తెలియని ఓ అభిమానిని వెతుక్కుంటూ వెళ్లడం, 'జీవితంలో కింద పడితే' ఎలా తిరిగి నిలబడొచ్చు అనే ధైర్యాన్ని అతని నుంచి నేర్చుకోవడం అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీలైన్. అలాగే ఓ సాధారణ అభిమాని తన అభిమాన హీరోకి సమస్య వస్తే సాయం చేసే స్థాయికి ఎలా ఎదిగాడు? అందుకు అతని ప్రేమ ఎలా కారణమైంది? అనేది ఈ ఇందులోని మరో ఉపకథ.

దర్శకుడు మహేష్ ఎంచుకున్న స్టోరీ లైన్ అద్భుతంగా ఉంది. అయితే ప్రధాన కథ కంటే ఉపకథకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. సినిమా ప్రారంభంలోనే హీరో సమస్య, అందుకు అభిమాని పరిష్కరించడాన్ని చూపించిన దర్శకుడు.. ఆ తర్వాత మొత్తం హీరో లవ్ స్టోరీ చుట్టూ కథ నడిపించాడు.

ఫస్ట్ హాప్‌లో ఎక్కువ భాగం థియేటర్‌‌లో హంగామా, హీరోహీరోయిన్స్‌ లవ్ స్టోరీపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అవన్నీ ప్రేక్షకులు ముందే ఊహించదగ్గ సన్నివేశాలు కావడంతో ఆ లవ్ స్టోరీ కూడా బోర్ కొట్టించింది. ప్రారంభంలో కనిపించిన ఉపేంద్ర పాత్ర.. మళ్లీ ఎప్పుడో కానీ కనిపించదు. దీంతో ఫస్ట్ హాప్‌ భారంగా నడుస్తుంది. హీరో పరుగెడుతూ ఎనర్జీగా కనిపిస్తాడు.. కథ మాత్రం అక్కడి నుంచి ముందుకెళ్లదు. 

సెకండాఫ్‌ మొదలయ్యాక హీరో, అభిమాని సంఘర్ణణతో కొంత వేగం పెరిగింది అనుకునేలోపే అసలు కథను పక్కనబెట్టి హీరో ఊరి నేపథ్యాన్ని కథలో బలవంతంగా ఇరికించినట్టుగా మారింది. దీంతో సెకండాఫ్‌ పడుతూ లేస్తూ ముందుకెళ్లింది.

అయితే క్లైమాక్స్‌ను కనెక్ట్ చేసిన విధానంగా బాగుంది. స్టోరీ పరంగా ఎమోషనల్‌ కంటెంట్‌ను ఎంచుకున్న దర్శకుడు దాన్ని ఎంగేజింగ్‌గా చెప్పడంలో తడబడ్డాడు. ఏదేమైనా ఎలాంటి అంచనాలు లేకుండా ఓసారి ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ చూసేయొచ్చు.

ఎవరెలా నటించారంటే:

సాగర్ పాత్రలో హీరో రామ్ ఒదిగిపోయి నటించాడు. మాస్ యాంగిల్ నుంచి పూర్తిగా బయటకొచ్చి నటించాడు. ఒక సగటు హీరో-అభిమానిగా రామ్ తనదైన శైలిలో నటించి కెరీర్ బెస్ట్ పెరఫార్మన్స్ ఇచ్చాడు. చాలా కాలం తర్వాత.. అంటే స్కంద, డబల్ ఇస్మార్ట్ వంటి మాస్ సినిమాల తర్వాత చాక్లెట్ బాయ్, లవర్ బాయ్, ఫ్యాన్ బాయ్ పాత్రలో వచ్చి అదరగొట్టాడు. ఎమోషనల్ సీన్స్లో మెప్పించాడు.

హీరోయిన్ భాగ్యశ్రీ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. రామ్-భాగ్యశ్రీల కెమిస్ట్రీ ఆడియన్స్కు ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. సూర్యకుమార్ అనే హీరో పాత్రలో ఉపేంద్ర తనదైన స్టైల్లో నటించారు. నిడివి తక్కువే అయినప్పటికీ తనదైన నటనతో మెప్పించారు. మిగతా పాత్రల్లో నటించిన రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, హర్షవర్థన్, రాజీవ్ కనకాలలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక అంశాలు:

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్&మెర్విన్.. ఈ సినిమాతో టాలీవుడ్ కి స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చారు. వీరి సంగీతంతో తెలుగు ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీలింగ్ కలిగించారు. "నువ్వుంటే చాలే మరియు చిన్ని గుండెలో" సాంగ్స్ తో మెప్పించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో ఎమోషన్స్‌ను బాగా ఎలివేట్ చేసేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ సిద్ధార్థ నూని తనదైన స్టైల్ లో విజువల్స్ చూపించి ఆకట్టుకున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. మైత్రి మేకర్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.