రామ నవమి విశిష్టత.. శ్రీ రాముడు ఏం చెప్తున్నాడు.. 

రామ నవమి విశిష్టత.. శ్రీ రాముడు ఏం చెప్తున్నాడు.. 

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు ప్రతీ యుగంలో ఓ అవతారం ఎత్తుతాడు. అలా త్రేతాయుగంలో రామావతారం ఎత్తాడు. చైత్ర శుద్ధ నవమి నాడు లోకాలన్నింటిచే నమస్కరించబడే, పూజించబడే శ్రీరాముడు జన్మించాడు. రాముని పేరు వినగానే గుర్తొచ్చేది ధర్మం. ఆయన పాటించిని నీతి, ధర్మాన్ని ఇప్పటికీ లోకాలన్నీ కీర్తిస్తాయి. పితృధర్మం, మాతృధర్మం, భ్రాతృధర్మం, స్నేహ ధర్మం, పత్నీ ధర్మం, ఋషుల ధర్మం..  ఇలా అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఆచరించినవాడు రాముడు. అందుకే  ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అంటూ శత్రువులు కూడా ఆయనను స్తుతించారు. 

రామ నవమి మహా విష్ణువు ఏడవ అవతారంగా చెప్పే శ్రీరాముని జన్మదినాన్ని సూచిస్తుంది. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. ఈ ప్రకారంగా, ప్రతీ ఏటా చైత్రమాసంలో అమావాస్య తర్వాత వచ్చే 9వ రోజును ‘శ్రీరామ నవమి’ గా గుర్తిస్తారు. ఇది చైత్ర నవరాత్రుల ముగింపును కూడా సూచిస్తుంది.

14సంవత్సరాలు వనవాసము చేసి, ఆ తర్వాత రావణ సంహారం గావించి సీతాసమేతంగా  తిరిగి అయోధ్యకు చేరిన శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడే పట్టాభిషిక్తుడైనాడు. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ ముహుర్తాన్నే జరిగిందని భక్తుల విశ్వాసం. అందుకే, శ్రీరామ నవమి రోజున దేవాలయాల్లో ఈ ఘట్టాలన్నింటినీ నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరుపుతారు, సీతారాములను పల్లకిలో ఊరేగిస్తారు.   

రాముడు ఏం చెప్తున్నాడు.. 

తండ్రి మాటకోసం.. పిన తల్లి కోరిక కోసం రాజకాంక్షను వదిలి అడవుల పాలైన వాడు రాముడు. శివధనుస్సును ఎత్తే సత్తా ఉన్నా.. గురువు విశ్వామిత్రుడు ఆజ్ఞాపించేవరకు అక్కడికి వెళ్లలేదు. గురువు మాటకు లోబడి ఉండేవాడు రాముడు. 

వినయ విధేయతలు కలిగిన వాడు. తానే దేవుడైనా.. పరుశురామున్ని ఎదురించే సత్తా ఉన్నా.. శివధనుస్సుని విరిచిన సమయంలో కోపంతో ఊగిపోతున్న పరశురామునికి ఎదురు తిరగలేదు. ఒక్కమాట అనలేదు. ప్రశాంతంగా ఆయన అన్నమాటల్ని విన్నాడు. ఆయన చేసిన సవాలును స్వీకరించి విష్ణుధనువును పైకి ఎత్తాడు రాముడు. తానే విష్ణు రూపాన్ని అలా అందరికీ తెలియజేశాడు.

రాముడు స్థితప్రజ్ఞుడు. తనకు దక్కుతుందనుకున్న రాజ్యం క్షణాల్లో చేజారిపోయింది. వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. రాభోగాలు అనుభవించాల్సిన సమయంలో ఆకులు అలములు తినాల్సి వచ్చింది. ఒకవైపు భార్యావియోగం. మరోవైపు రాక్షసబాధ. వయసేమంత పెద్దది కాదు.  అయినా  చలించలేదు. స్థిరంగా, దృఢంగా ఉన్నాడు. స్థితప్రజ్ఞతతో వ్యవహరించాడు. సైన్యాన్ని పోగు చేశాడు. మిత్రులను పెంచుకున్నాడు. రాక్షస సంహారం చేసి భార్యను తిరిగి పొందాడు.

చేసిన సాయాన్ని ఎన్నడూ మరువకూడదని రాముడు చెప్తున్నాడు. కృతజ్ఞత ఆయన రక్తంలోనే ఉంది. అందుకే సీత జాడ తెలుసుకున్న హనుమంతున్ని బిడ్డలా చూసుకున్నాడు. చనువు ఇచ్చాడు. ప్రేమను పంచాడు. తను గెలుచుకున్న రాజ్యానికి మిత్రుడు విభీషనునికి పట్టం కట్టాడు. సుగ్రీవునికి మకుటం అందించాడు. 

రావణ రాజ్యం గెలిచినా అక్కడినుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా ముట్టుకోలేదు. రావన రాజ్యంపై లక్ష్మణుడు ఆశ పడ్డా అతన్ని వద్దని వారించాడు. జననీ జన్మభూమిశ్చ. స్వర్గాదపి గరీయసీ అంటూ సొంత రాజ్యాన్ని గుర్తు చేశాడు. ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అని సూచించాడు. 

రామ నైవేద్యం: 

పానకం: 

కావలసినవి:  బెల్లం పొడి– పావు కేజీ;  నీళ్లు– లీటరు;  యాలకుల పొడి– టీ స్పూన్‌;  మిరియాల పొడి– టీ స్పూన్‌;  శొంఠిపొడి– చిటికెడు
తయారీ: బెల్లం పొడిలో నీటిని కలిపి కరిగిన తర్వాత వడపోయాలి. ఈ బెల్లం నీటిలో యాలకుల పొడి, మిరియాల పొడి, శొంఠిపొడి కలిపితే పానకం రెడీ.

వడపప్పు

కావలసినవి:  పెసరపప్పు – పావు కేజీ; పచ్చిమిర్చి ముక్కలు – టీ స్పూన్‌; పచ్చి కొబ్బరి తురుము– టేబుల్‌ స్పూన్‌; మామిడి కాయ తురుము– టేబుల్‌ స్పూన్‌
తయారీ: పెసరపప్పు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి. గింజ మెత్తబడిన తర్వాత నీటిని వంపేసి అందులో పైన తీసుకున్న దినుసులన్నీ కలిపితే వడపప్పు రెడీ.

హెల్త్ బెనిఫిట్స్ :  వడపప్పు, పానకం ఆరోగ్యకరమైనవి. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు తొలగిపోతాయి. వేసవి మొదలైన ఈ సమయంలో ఆరోగ్యం ఒడిదొడుకులను పానకం నివారిస్తుంది. యాలకుల పొడి అతిదాహాన్ని తగ్గిస్తుంది.