రోప్ వేతో రామగిరి ఖిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు.. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రోప్ వేతో రామగిరి ఖిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు.. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి, వెలుగు : రామగిరి ఖిల్లాకు ‘రోప్​ వే’ ప్రాజెక్టు పూర్తయితే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని సెగ్మెంట్ పరిధి రామగిరి మండలంలోని ఖిల్లాకు కేంద్రం రోప్​వే ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఎంపీ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 

రామగిరి ఖిల్లా పర్యాటకాభివృద్ధిలో భాగంగా ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రోప్‌‌‌‌‌‌‌‌వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించించడం హర్షనీయమన్నారు. గత పదేండ్లలో ఖిల్లా   అభివృద్ధిలో నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ ప్రాజెక్టు సాధనకు ఏడాదిన్నర కాలంగా  కేంద్ర మంత్రులకు ప్రతిపాదనలు సమర్పించడంతోనే వచ్చిందన్నారు.  రామగిరి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తూ మౌలిక సదుపాయాల అవసరాన్ని  పార్లమెంట్ లో పలుమార్లు ప్రతిపాదించానన్నారు. 

పర్వత మాల ప్రాజెక్టు కింద రూ.2.46 కోట్లతో 2.1 కిలోమీటర్ల పొడవైన రోప్‌‌‌‌‌‌‌‌వే నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.  ఖిల్లా కోట పాదాల నుంచి కొండపైకి భక్తులు, పర్యాటకులు సులభంగా, సురక్షితంగా రోప్ వే ద్వారా చేరుకోవచ్చన్నారు. రామగిరి పరిసరాల్లో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం మరో రూ.2.5 కోట్లు కేటాయించిందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు, చిన్న వ్యాపారులకు ఆదాయం పెరుగుతుందన్నారు. రామగిరి అభివృద్ధిలో ఇది ఒక కొత్త అధ్యాయం అని ఎంపీ పేర్కొన్నారు.