పోచమ్మ మైదానంలో నిర్మాణాల కూల్చివేత

గోదావరిఖని, వెలుగు :  గోదావరిఖని పోచమ్మ మైదానంలో పలువురు చేపట్టిన నిర్మాణాలను రామగుండం కార్పొరేషన్​ టౌన్​ ప్లానింగ్​ ఆఫీసర్లు శుక్రవారం రాత్రి కూల్చివేశారు. గతంలో ఈ స్థలం తమదే అని సింగరేణి సంస్థ కోర్టుకు వెళ్ళగా, పట్టాదారుల నుంచి తాము కొనుగోలు చేసినట్టు పలువురు పేర్కొంటూ నిర్మాణాలు చేపట్టారు. చమ్మ మైదానంలో 12 మంది చేపట్టిన నిర్మాణాల స్థలం ఎవరిది, వారికి పట్టా సర్టిఫికెట్లు ఉన్నాయా.. అని సింగరేణి సంస్థ తహసీల్దార్​కు దరఖాస్తు చేసింది. 

రామగుండం తహసీల్దార్​ ఆఫీస్​లో దాదాపుగా 20 నుంచి 25 ఏళ్ళ వరకు ఉన్న రికార్డులను ఇటీవల పరిశీలించి 12 మందిలో ఎవరికి పట్టా సర్టిఫికెట్లను ఎమ్మార్వో ఆఫీస్​ నుంచి ఇవ్వలేదని, రెవెన్యూ రికార్డులలో వారి పేర్లు లేవని తేల్చారు.  రామగుండం కార్పొరేషన్​ టౌన్​ ప్లానింగ్​ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పోచమ్మ మైదానంలో కట్టడాల కూల్చివేతను ప్రారంభించారు. నిర్మాణదారులకు స్థలానికి సంబంధించిన పట్టా సర్టిఫికెట్లు లేని కారణంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని అడిషనల్​ కలెక్టర్​, రామగుండం కమిషనర్​ జె.అరుణశ్రీ తెలిపారు.