రమణీయం.. రామపట్టాభిషేకం

రమణీయం.. రామపట్టాభిషేకం
  • పెద్ద సంఖ్యలో హాజరైన శ్రీరామ దీక్షాపరులు 

భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీరామపునర్వసు దీక్షల విరమణ తర్వాత రోజు రామపట్టాభిషేకం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ముందుగా ఉదయం గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ నిర్వహించారు. తర్వాత కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చారు. 

నిత్య కల్యాణం అనంతరం పట్టాభిషేక క్రతువు ప్రారంభించారు. సమస్త నదీ, సముద్ర జలాలతో సంప్రోక్షణ జరిపి స్వామివారలు, భక్తులపై చల్లారు. భక్త రామదాసు చేయించిన ఆభరణాలను రాములవారికి అలంకరించారు. రాజదండం, రాజముద్రికలను సమర్పించారు. కిరీటాన్ని అలంకరించడంతో పట్టాభిషేక క్రతువు ముగిసింది. సాయంత్రం స్వామికి దర్బారు సేవ నిర్వహించారు.