నక్కలగండి భూనిర్వాసితులకు..త్వరలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లిస్తాం:ఎమ్మెల్యే బాలూనాయక్

నక్కలగండి భూనిర్వాసితులకు..త్వరలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లిస్తాం:ఎమ్మెల్యే బాలూనాయక్

దేవరకొండ/చందంపేట/ డిండి, వెలుగు : నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న భూనిర్వాసితులకు త్వరలో ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించి, ఇండ్ల నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేస్తామని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. మంగళవారం చందంపేట మండలం నక్కలగండి ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. డిండి వాగు వల్ల పంట నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూనిర్వాసితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాత పరిహారం అందజేస్తామని తెలిపారు. అనంతరం డిండి ప్రాజెక్టు నుంచి చందంపేట, నేరేడుగొమ్ము, దేవరకొండ మండలాల్లోని కుంటలను నింపడానికి కామేపల్లి గ్రామం వద్ద కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. అంతకుముందు డిండి ప్రాజెక్టు అలుగుపోయడంలో ప్రాజెక్టు వద్ద అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

ఆయా కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, మండలాల పార్టీ అధ్యక్షులు బాద్యానాయక్, దొంతినేని వెంకటేశ్వర్ రావు, మాజీ ఎంపీపీలు పార్వతీచందునాయక్, గోవింద్, ముత్యాల సర్వయ్య, మాజీ జడ్పీటీసీ లచ్చిరామ్ నాయక్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు హరికృష్ణ, పీఏసీఎస్​చైర్మన్ శ్రీశైలం యాదవ్, భరత్, అధికారులు తదితరులుపాల్గొన్నారు.