మునుగోడు భయంతోనే దాడులు

మునుగోడు భయంతోనే దాడులు

జనగామ : మునుగోడు ఉప ఎన్నిక భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్లు విసరడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పాదయాత్ర చేసుకునే స్వాతంత్ర్యం లేదా ప్రశ్నించారు. దాడి వెనుక ఎర్రబెల్లి దయాకర్ రావు హస్తం ఉందని రాణి రుద్రమ ఆరోపించారు. తమపై దాడులు చేస్తే దయాకర్ రావు పాలకుర్తిలో తిరగలేరని హెచ్చరించారు. ప్రభుత్వం బండి సంజయ్కు ఎందుకు రక్షణ కల్పించడం లేదని ప్రశ్నించిన ఆమె.. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ బాధ్యత వహించాల్సి ఉంటదని స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణలోని ప్రతి గడపను తాకుతుందని.. ప్రతి సమస్యను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలుసుకుంటారని చెప్పారు. ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్తామన్న రాణి రుద్రమ.. టీఆర్ఎస్ నేతలకు మునుగోడు ఉప ఎన్నిక భయం పట్టుకుందని అన్నారు.

దయాకర్ రావుకు అదే గతి

కడవెండి విస్నూర్ దొరలకు పట్టిన గతే ఎర్రబెల్లి దయాకర్ రావుకు పడుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప తెలిపారు. సంజయ్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే దాడి చేయించారని ఆరోపించారు. టీఆర్ఎస్ ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వమని సంగప్ప విమర్శించారు.. కేటీఆర్ సిరిసిల్లకు వెళ్తే బీజేపీ కార్యకర్తలను ముందే అరెస్ట్ చేస్తారని, అలాంటిది టీఆరెస్ కార్యకర్తలు దాడి చేసే అవకాశముందని ముందే సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు.